ఆసక్తికర పరిణామం.. అక్కడ చేతులు కలిపిన కాంగ్రెస్-బీజేపీ

Spread the love

మహారాష్ట్రలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజకీయంగా భిన్న ధృవాలుగా ఉండే బీజేపీ-కాంగ్రెస్ లు మహారాష్ట్రలోని అంబర్నాథ్ ప్రాంతానికి మేయర్ ఎన్నిక కోసం చేతులు కలిపాయి. కొన్ని వారాల కితం ఇక్కడ స్థానిక ఎన్నికలు జరిగాయి.ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే నేతృత్వంలోని శివసేనకు అధికారం దక్కకుండా ఉండేందుకు ఈ అరుదైన కూటమి ఏర్పాటయ్యింది. కూటమిలోని 32 మంది కౌన్సిలర్ల సపోర్టుతో బీజేపీకి  చెందిన తేజశ్రీ కరంజులే ఇక్కడ మేయర్ పదవిని చేజిక్కించుకున్నారు. వీరిలో 16 మంది బీజేపీ, 12 మంది కాంగ్రెస్, నలుగురు ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం)కి చెందిన వారు ఉన్నారు. మేయర్ పదవి కోసం కాంగ్రెస్, బీజేపీ చేతులు కలపడంపై శిందేకు చెందిన శివసేన పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. శివసేన ఎమ్మెల్యే బాలాజీ కినికార్ దీనిని  ప్రశ్నించారు. ఇది తమకు వెన్నుపోటు పొడవడమేనని ఆరోపించారు. అయితే, ఈ విమర్శలను బీజేపీ ఉపాధ్యక్షుడు గులాబ్రావ్ కరంజుల్ పాటిల్ కొట్టిపారేశారు. అంబర్ నాథ్ శివసేనతో పొత్తుకు తమ పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేసిందన్నారు.