త్వరలోనే రాజకీయ పార్టీతో ప్రజల ముందుకు రానున్నట్లు ఇప్పటికే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె శాసనమండలిలో ఉద్వేగభరిత ప్రసంగం కూడా చేశారు. ఇక ఆవిడ రాజీనామా ఆమోదం వంటి పరిణామాలపై తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. కవిత వచ్చి విజ్ఞప్తి చేయడంతోనే ఆమె రాజీనామాను ఆమోదించినట్లు తెలిపారు. ఎమోషనల్ గా రాజీనామా చేసినప్పుడు కొంతకాలం వేచిచూస్తామని ఆమె విషయంలోనూ అదే జరిగిందని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కవిత కొత్త పార్టీ ప్రకటన పైన కూడా గుత్తా స్పందించారు.
రాష్ట్రంలో కొత్తగా పార్టీలు పెట్టాల్సినంత అవసరం లేదని కొత్త పార్టీ వచ్చినా మనుగడ కష్టమని అన్నారు. గతంలో వచ్చిన పలు రాజకీయ పార్టీలు కనుమరుగయ్యాయన్నారు. ఇక డీలిమిటేషన్ గురించి మాట్లాడుతూ ఏ ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడతారనే దానిపై స్పష్టత లేదని జనాభా ప్రాతిపదికన జరిగితే అది దక్షిణాది రాష్ట్రాలకు నష్టమని అన్నారు.ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించడంపై స్పందిస్తూ అది సరికాదని గుత్తా అన్నారు.