విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ గ్రౌండ్స్ లో నిన్న జరిగిన సంక్రాంతి సంబరాల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జి.వి.ఎల్. నరసింహారావుకు వెంకయ్య అభినందనలు తెలిపారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు బిడ్డగా పుట్టిన నాకు రైతులంటే ఎంత అభిమానమో రైతులకు సంబంధించిన పండుగలన్నా అంతే ఆసక్తి. తెలుగు లోగిళ్ళకు తొలి కాంతిని తీసుకువచ్చే సంక్రాంతి, అచ్చంగా తెలుగు రైతుల పండుగని పేర్కొన్నారు. పండుగ అంటే కొత్తబట్టలు, పిండి వంటలే కాదు, మన సంస్కృతి సంప్రదాయాలు. మన ఆచార వ్యవహారాలు. మన ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలి, పెద్దలకు గౌరవాన్ని ఇవ్వాలి, పదిమందికీ సాయం చేయాలనే భారతీయ సంస్కృతిని భావితరాలకు తెలియజేసే మార్గాలే పండుగలని పేర్కొన్నారు. కుటుంబ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలన్నారు. సంక్రాంతి అంటే అది ప్రకృతి పండుగ. ప్రకృతిలోని ప్రతి జీవితో మన ఆనందాన్ని పంచుకోవాలి. ప్రకృతిని ప్రేమించాలి. ప్రకృతితో కలిసి జీవించాలని పిలుపునిచ్చారు. మన ఆనందాన్ని అందరితో పంచుకోవాలనే భారతీయ సంస్కృతి కీలక భావన షేర్ అండ్ కేర్ సంక్రాంతిలో కనిపిస్తుందని తనదైన శైలిలో ప్రసంగించారు.