1275 కిలోల బోన్ లెస్ చికెన్.. రిపబ్లిక్ డే వేడుకల కోసం వినూత్న వ్యూహం  

Spread the love

గణతంత్ర వేడుకల సందర్భంగా ఢిల్లీలో నిర్వహించే యుద్ధ విమానాల విన్యాసాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఢిల్లీ అటవీ శాఖ సంయుక్తంగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. విమానాలకు పక్షులు అడ్డు రాకుండా ఉండేందుకు ఈ ఏడాది సుమారు 1275 కిలోల బోన్‌లెస్ చికెన్‌ను వినియోగించాలని నిర్ణయించారు. ఎర్రకోట, జామా మసీద్, ఢిల్లీ గేట్ వంటి 20 కీలక ప్రాంతాల్లో జనవరి 15 నుంచి 26 వరకు రెండు రోజులకు ఒకసారి కొంత ఎత్తు నుంచి ఈ మాంసం ముక్కలను జారవిడుస్తారు. దీనివల్ల గద్దలు వంటి పెద్ద పక్షులు ఆకాశంలోకి ఎక్కువ ఎత్తుకు వెళ్లకుండా, తక్కువ స్థాయిలోనే ఆహారం కోసం సంచరిస్తూ విమాన మార్గాలకు దూరంగా ఉంటాయి.

వన్యప్రాణుల సంరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈసారి ప్రత్యేకంగా ఎముకలు లేని (బోన్‌లెస్) చికెన్‌ను వాడటం గమనార్హం. పరేడ్‌కు ముందు 10-15 రోజుల పాటు పక్షులకు ఈ ఆహార అలవాటును కల్పించడం ద్వారా, ప్రదర్శన సమయంలో అవి విమానాలకు ఢీకొనే ప్రమాదాన్ని నివారించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ వినూత్న కార్యక్రమం కోసం ఒక్కో ప్రదేశంలో సగటున 20 కిలోల మాంసాన్ని వినియోగించనున్నారు. గణతంత్ర వేడుకలు ప్రశాంతంగా, సురక్షితంగా సాగేందుకు ఇప్పటికే దీనికి సంబంధించి టెండర్ నోటీసులను కూడా జారీ చేశారు.