సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ రాని కారణంతో తమిళ నటుడు విజయ్ కథానాయకుడిగా నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర నిర్మాత వెంకట్.కె.నారాయణ పరిస్థితి తమ చేయి దాటిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా వాయిదా నేపథ్యంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విజయ్ కు సపోర్టుగా నిలిచారు.బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తమ రాజకీయ లబ్ధి కోసం సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. తాజాగా ఈ లిస్టులో సెన్సార్ బోర్డు కూడా చేరిందని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులనుభయపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సి.బి.ఎఫ్.సి ని కూడా ఉపయోగిస్తోందని ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.ఈ విషయంలో తమిళనాడు కాంగ్రెస్ నేతలు సైతం విజయ్ కు మద్దతుగా నిలిచారు. అయితే ఈ విషయంలో జాప్యం వెనక కేంద్ర ప్రభుత్వం ఉందనే ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. సెన్సార్ బోర్డు రూల్స్ ప్రకారం బోర్డు సభ్యులు సినిమాల విషయంలో నిర్ణయం తీసుకుంటారని.. దీనిని రాజకీయ దృష్టితో చూడాల్సిన అవసరం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ అన్నారు.