ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగంలో అంతరాయం ఏర్పడింది. దేశ డిఫెన్స్ సెక్టార్ కు అత్యంత కీలకమైన ‘ఈఓఎస్-ఎన్1’ (లేదా) ‘అన్వేష’ ఉపగ్రహాన్ని ఆర్బిట్ లోకి మోసుకెళ్లిన ఈ రాకెట్లో సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని ఇస్రో (ISRO) చైర్మన్ వి. నారాయణన్ తెలిపారు. ఈ ప్రయోగం మొత్తం నాలుగు దశల్లో పూర్తి కావాల్సి ఉంది. అయితే, మూడో దశ వరకు సాఫీగానే సాగిందని, ఆ తర్వాత కొంత అంతరాయం ఏర్పడిందని తెలిపారు. సమస్యకు గల కారణాలను విశ్లేషించి మరిన్ని వివరాలను ప్రకటిస్తామని వెల్లడించారు.
శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈరోజు ఉదయం 10.18 గంటలకు పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ‘ఈఓఎస్-ఎన్1’తో పాటు భారత్, యునైటెడ్ కింగ్డమ్, థాయిలాండ్, బ్రెజిల్, స్పెయిన్, నేపాల్ మొదలగు దేశాలకు చెందిన మరో 14 చిన్న శాటిలైట్స్ కూడా తీసుకెళ్లింది. అయితే, వీటినిఆర్బిట్ లోకి ప్రవేశపెట్టే సమయంలో ఈ అంతరాయం ఏర్పడింది. 2026లో ఇస్రో (ISRO) చేపట్టిన తొలి ప్రయోగం ఇదే. ఇక న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎఎస్ ఐఎల్) చేపట్టిన 9వ పూర్తిస్థాయి కమర్షియల్ మిషన్ ఇది. ఈ మిషన్లో మెయిన్ శాటిలైట్ ఈఓఎస్-ఎన్1. డిఫెన్స్, రీసెర్చ్, అభివృద్ధి సంస్థ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్, బోర్డర్స్ లో నిఘాకు, అగ్రికల్చర్, డిజాస్టర్ మానేజ్మెంట్ కు ఉపయోగపడనుంది.