నిజాయితీకి నిలువెత్తు రూపం: రూ. 45 లక్షల విలువైన బంగారు నగలను అప్పగించిన పారిశుద్ధ్య కార్మికురాలు!

Spread the love

చెన్నైలో ఒక పారిశుద్ధ్య కార్మికురాలు చేసిన పనికి, ఆమె నిజాయితీకి  సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.  45 సవర్ల బంగారు ఆభరణాలను పోలీస్ స్టేషన్ లో అప్పగించి ఎందరికో మార్గదర్శకంగా నిలిచిన ఆమె పేరు పద్మ. ఈనెల 11న చెన్నై టీనగర్లో చెత్త సేకరణ విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో రోడ్డుపై పడి ఉన్న ఓ బ్యాగును గమనించిన ఆమె దానిని  తెరచి చూడగా బంగారు నగలు  కనిపించాయి. వెంటనే బ్యాగును పాండిబజార్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. పోలీసులు విచారణ  జరిపి ఆ బ్యాగు నంగనల్లూరు చెందిన రమేశ్ కు చెందినదని  గుర్తించారు. బ్యాంకుల్లో వేలం వేసే బంగారు నగలను ఆయన కొని  విక్రయిస్తుంటారని, అలా వేలంలో పొందిన నగలను తీసుకుని వెళ్తుండగా టీనగర్ లో ఆయన పడేసుకున్నట్లు తేలింది. ముందుగానే ఆయన పాండిబజార్ పోలీస్ స్టేషన్లో నగల బ్యాగు పోయిందని కంప్లైంట్  చేశారు. రూ.45 లక్షల విలువైన బంగారు నగలను నిజాయతీగా అప్పగించిన పద్మను పోలీసులు, నగల యజమాని అభినందించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఆమె నిజాయితీని మెచ్చుకుని ప్రశంసించి రూ.లక్ష నగదుతో సత్కరించారు.