ఇరాన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను విదేశాంగ శాఖ క్షేమంగా భారత్ కు తీసుకువచ్చింది. మొదటి విడతలో భాగంగా గత అర్ధరాత్రి తర్వాత పలువురు భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం వారు ఇరాన్ లో పరిస్థితుల గురించి మీడియాతో మాట్లాడారు. అక్కడి పరిస్థితిని వివరించారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ నిలిపివేయడంతో తమ పరిస్థితిని కుటుంబసభ్యులకు వివరించే అవకాశం లేక తీవ్ర భయాందోళనకు లోనైనట్లు తెలిపారు. విదేశాంగశాఖ అధికారులను సంప్రదించడానికి కూడా వీలు కాలేదన్నారు. తిరిగి భారత్ కు చేరుకోవడం పట్ల భావోద్వేగం చెందారు. ఇటువంటి క్లిష్ట సమయంలో తమను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తమ వారి కోసం ఎయిర్ పోర్టుకు చేరుకున్న కుటుంబసభ్యులు మాట్లాడుతూ చాలా రోజులుగా తమ వారితో ఎటువంటి సంప్రదింపులు లేవని తెలిపారు. ఇరాన్ లో ఉద్రిక్తతల నేపథ్యంలో వారి పరిస్థితిపై తాము ఆందోళన చెందినట్లు తెలిపారు.అయితే భారత ప్రభుత్వం చొరవతో తమ కుటుంబసభ్యులు తిరిగి వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు.