చరిత్ర తిరగ రాయటం తెలుగువాళ్ల వల్లే సాధ్యం ..గ్రీన్  అమ్మోనియా ప్లాంట్‌ కు శంకుస్థాపన  

Spread the love

ఏఎం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్లాంట్‌కు ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది సంక్రాంతికి 30 లక్షల మందికిపైగా ఆంధ్రప్రదేశ్‌లోని స్వస్థలాలకు వచ్చారు. హైదరాబాద్ నుంచి 3 లక్షల వాహనాలు పండగ కోసం ఏపీకి వచ్చాయి. సంక్రాంతి వేడుకల్లో భాగంగా జగ్గన్నతోట ప్రభల తీర్థం ఉత్సవాలు అత్యద్భుతంగా నిర్వహించారన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్రాజెక్టు మన రాష్ట్రంలో ఏర్పాటు చేయటం సంతోషదాయకమని అన్నారు. ఏఎం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్రాజెక్టును ప్రారంభించిన ప్రమోటర్లకు అభినందనలు తెలిపారు. గత ఏడాది గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. 2027 జూన్ కల్లా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.   చరిత్ర తిరగ రాయటం తెలుగువాళ్ల వల్లే సాధ్యం అవుతుందని మరోమారు నిరూపితం అవుతోందని కాకినాడ నుంచి గ్రీన్ అమోనియా సరఫరా జర్మనీకి సరఫరా అవుతుందన్నారు. గతంలో గ్రే అమోనియా తయారీని నాగార్జునా ఫెర్టిలైజర్స్ చేపట్టింది. ఇప్పుడు అదే ప్రాంతంలో గ్రీన్ అమోనియా తయారు చేసి పర్యావరణ హిత ఉత్పత్తులు తయారవుతాయన్నారు. పర్యావరణ సమతుల్యత సాధించటమే ప్రస్తుతం ఉన్న లక్ష్యమని దానికి అనుగుణంగా ప్రణాళికలు జరుగుతున్నాయన్నారు. ప్రకృతి విపత్తులు, సముద్ర మట్టాలు పెరగటం వల్ల భూమి కోతకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఆయన లక్ష్యాన్ని అందిపుచ్చుకుని ఏపీలో 160 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని తయారు చేసేలా లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు తెలిపారు.