రజినీకాంత్ హేమ మాలిని సినిమా ఇప్పుడు రిలీజ్..!

Spread the love

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌, హిందీ సినీ దిగ్గజాలు శత్రుఘ్న సిన్హా, హేమా మాలిని ప్రధాన పాత్రల్లో నటించిన ‘హమ్ మే షెహెన్‌షా కౌన్’ గురించి ఈ జనరేషన్ వాళ్ళం విని ఉండం కదా… కానీ ఈ కాంబినేషన్ కోసం అప్పట్లో చాల మంది వెయిట్ చేసారు. సినిమా అనౌన్స్ కూడా అయ్యింది. షూటింగ్ కూడా అయ్యింది… కానీ రిలీజ్ అవ్వలేదు.బట్ పరవాలేదు… ఒక జీవిత కాలం లేటు అంటే సామెత వినే ఉంటారు కదా… అలానే ఈ సినిమా ని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాదాపు 37 ఏళ్ల క్రితం తెరకెక్కిన ఈ సినిమా అనేక కారణాల వల్ల అప్పట్లో థియేటర్లకు రిలీజ్ అవ్వలేదు. ఎన్నో అడ్డంకులు, అనిశ్చిత పరిస్థితులు, 37 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుండటం బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.దివంగత దర్శకుడు హర్మేష్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాను నిర్మాత రాజా రాయ్ నిర్మించారు. అప్పటి స్టార్ కాస్టింగ్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో అనితా రాజ్, ప్రేమ్ చోప్రా, శరత్ సక్సేనా కీలక పాత్రల్లో నటించగా, లెజెండరీ నటులు అమ్రిష్ పురి, జగదీప్ కూడా ఇందులో కనిపించనున్నారు. అప్పట్లోనే భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమా, వివిధ కారణాల వల్ల విడుదల ఆలస్యం అవుతూ వచ్చిందని సమాచారం.ఈ సినిమా విడుదలపై తాజాగా స్పందించిన నిర్మాత రాజా రాయ్ మాట్లాడుతూ,“ఈ సినిమాపై మేము ఎప్పుడూ ఆశ కోల్పోలేదు. ఇది ఎన్నో ఎదురుదెబ్బలు, నిశ్శబ్దంతో కూడిన బాధని భరించింది. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ సినిమా ప్రేక్షకులను కలుసుకుంటున్నందుకు కృతజ్ఞుడను. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి అన్ని రకాల అడ్డంకులను ఎదుర్కొని బయటపడింది. త్వరలోనే విడుదల తేదీని ఖరారు చేసుకోనుంద’” అని తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ సినిమాను నేటి ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఆధునిక సాంకేతికతతో తీర్చిదిద్దినట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి. అసలు కథలోని భావోద్వేగాలు, సినిమాటిక్ అనుభూతి ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుని, విజువల్స్‌ ఇంకా ఆడియో నాణ్యతను మెరుగుపరిచారని తెలిపారు. ఇందుకోసం ఏఐ టెక్నాలజీ, 4K రీమాస్టరింగ్ సహా పలు ఆధునిక పద్ధతులను వినియోగించి, థియేటర్ స్థాయికి తగ్గట్టుగా చిత్రాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం.మొత్తంగా చూస్తే, దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా, రజనీకాంత్ అభిమానులతో పాటు సినీ చరిత్రపై ఆసక్తి ఉన్నవారిలో కూడా ప్రత్యేకమైన ఉత్సుకతను కలిగిస్తోంది. అప్పటి స్టార్ కాస్టింగ్, క్లాసిక్ టచ్‌తో ఈ చిత్రం ఇప్పుడు ఎలాంటి స్పందన పొందుతుందో చూడాల్సి ఉంది.