జమ్మూ-కాశ్మీర్ లో భారీగా హిమపాతం

Spread the love

జమ్మూ-కశ్మీర్ లో భారీగా మంచు కురుస్తోంది. గత రోజు సాయంత్రం నుంచి విపరీతంగా మంచు కురుస్తుండడంతో పలు ప్రాంతాలు మంచుదుప్పటి కప్పేశాయి.  ప్రతికూల వాతావరణంతో పలు రోడ్లను మూసేశారు. కీలక ప్రాంతాల్లో రైల్వే సర్వీసులు కూడా  రద్దు చేశారు. కొద్దిపాటి  వర్షాలకు విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. శ్రీనగర్ ఎయిర్ పోర్టులో  కార్యకలాపాలన్నీ రద్దయినందున విమాన రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. దట్టంగా మంచు కురుస్తోన్న పూంచ్, ఉదంపుర్ జిల్లాల్లో చిక్కుకుపోయిన 100 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. జమ్మూలోని మాతా వైష్ణో దేవి ఆలయంలోనూ మంచు కురవడంతో కొన్నిగంటలపాటు యాత్రను నిలిపివేశారు. విపరీతంగా కురుస్తోన్న హిమాపాతం కారణంగా  జమ్మూ-శ్రీనగర్ నేషనల్ హైవే పై ట్రాఫిక్ కు  అంతరాయం ఏర్పడిందని, వేల వాహనాలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. మొఘల్ రోడ్డు, శ్రీనగర్-లేహ్ నేషనల్ హైవే, సింతాన్ రోడ్లనూ మూసివేసినట్లు తెలిపారు. మరోవైపు, మంచు ఉప్పెన ఏర్పడే ప్రమాదమున్న ఆరు జిల్లాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. స్థానిక ప్రజలు, పర్యాటకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.