వైరా నదిపై రిటైనింగ్ వాల్ మరియు సమగ్ర స్మార్ట్ వాటర్ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణానికి శంకుస్థాపన

Spread the love

వరద ముప్పు నుండి మధిర పట్టణాన్ని శాశ్వతంగా రక్షించేందుకు రూ. 140 కోట్ల అంచనా వ్యయంతో వైరా నదిపై రిటైనింగ్ వాల్ మరియు సమగ్ర స్మార్ట్ వాటర్ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణానికి తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేడు శంకుస్థాపన చేశారు. దీంతో వర్షాకాలంలో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న వరద సమస్యలకు ఈ ప్రాజెక్టుల ద్వారా శాశ్వత పరిష్కారం లభించనుంది. ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, నాణ్యతతో కూడిన స్మార్ట్ మౌలిక సదుపాయాలను కల్పిస్తూ, ప్రజల సంక్షేమం మరియు సురక్షిత జీవన ప్రమాణాల కోసం తమ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని తెలిపారు. మధిరను రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఇక మధిర నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలోనే దివ్యాంగుల సంక్షేమం కోసం రూ. 100 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. దివ్యాంగ విద్యార్థులకు ఐప్యాడ్లు, ల్యాప్‌టాప్‌లు అందిస్తూ వారి ఉన్నత చదువులకు ప్రభుత్వం భరోసానిస్తోందని తెలిపారు. అంగవైకల్యం అనేది ఎదిగేందుకు అడ్డంకి కాకూడదని, వారిని సమాజంలో మనతో సమానంగా గౌరవప్రదమైన స్థితిలోకి తీసుకురావడమే తమ  లక్ష్యమని పేర్కొన్నారు. దివ్యాంగులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చూస్తూ, ప్రతి అడుగులోనూ ప్రభుత్వం తోడుగా ఉంటుందని భరోసానిచ్చారు.