వరంగల్ చారిత్రక కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వరంగల్ మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు 300 ఎకరాల భూమిని కేంద్ర విమానయాన శాఖకు అప్పగించిన రోజు తెలంగాణ విమానయాన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని అభివర్ణించారు. 1930లో నిజాం కాలంలోనే నిర్మితమై, ఒకప్పుడు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా వెలుగొందిన మామునూరు వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ₹300 కోట్ల నిధులు కేటాయించి, దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారానికి కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.