భారత్ లోని వెస్ట్ బెంగాల్ లో ఇటీవల ఇద్దరు వ్యక్తులకు నిఫా వైరస్ సోకడంతో ప్రభుత్వం అలెర్ట్ అయింది. వైరస్ వ్యాప్తి కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. అయితే ఈ వైరస్ వ్యాప్తి భయంతో థాయిలాండ్, చైనా, నేపాల్, తైవాన్, మలేసియా వంటి దేశాలు తమ దేశాలకు వచ్చే భారతీయులకు నిఫా స్క్రీనింగ్ టెస్టులు ప్రారంభించాయి. అయితే దీనిపై స్పందించిన ‘వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్’ భారత్ లో ‘నిఫా’ వైరస్ ప్రభావం అంతగా లేదని దానితో ప్రమాదమేమీ లేదని ప్రపంచ దేశాలకు తెలిపింది. భారత్ ఈ వైరస్ ను అరికట్టేందుకు తగు చర్యలు తీసుకుంటోందని వివరించింది. ఈ వైరస్ వలన భారత్ పై ట్రావెల్, వాణిజ్య పరిమితులు విధించాల్సిన అవసరం లేదని సూచించింది. ఈ ‘నిఫా’ వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందనే దానికి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. దీని వలన ప్రపంచ దేశాలకు ప్రమాదం లేదని పేర్కొంది. వ్యాధి బారిన పడిన వ్యక్తులు ఎటువంటి ప్రయాణాలు చేయలేదని భారత ప్రభుత్వం పేర్కొన్నట్లు తెలిపింది. కాబట్టి భారత్ లోని ఇతర రాష్ట్రాలకు ఈ వైరస్ ప్రబలే అవకాశం లేదని వివరించింది.