మెలానియా డాక్యుమెంటరీ ప్రీమియర్ కి ఏ.ఆర్. రెహమాన్

Spread the love

అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ జీవితాన్ని కేంద్రంగా చేసుకుని రూపొందించిన డాక్యుమెంటరీ ‘మెలానియా’ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ డాక్యుమెంటరీకి సంబంధించి తాజాగా మరో విశేష వార్త వెలుగులోకి వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ డాక్యుమెంటరీ ప్రీమియర్‌కు ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. హాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులతో పాటు రెహమాన్ కూడా ఈ ప్రత్యేక ప్రీమియర్ షోను వీక్షించనున్నారని సమాచారం. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని ప్రతిష్టాత్మక కెన్నడీ సెంటర్ వేదికగా ‘మెలానియా’ డాక్యుమెంటరీ ప్రీమియర్‌ ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సినిమా, క్రీడలు, రాజకీయ రంగాలకు చెందిన అంతర్జాతీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ముఖ్యంగా సంగీత రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఏ.ఆర్. రెహమాన్‌కు ఉన్న గుర్తింపు, గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనను ఈ ప్రీమియర్‌కు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో రెహమాన్ హాజరు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక ప్రీమియర్ షోకు ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో, అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్, అలాగే ట్రంప్ ప్రభుత్వ కేబినెట్‌కు చెందిన పలువురు కీలక సభ్యులు కూడా హాజరుకానున్నారు. అంతర్జాతీయ స్థాయిలో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో జరగనున్న ఈ ప్రీమియర్ కార్యక్రమం ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది. ఈ డాక్యుమెంటరీకి హాలీవుడ్ దర్శకుడు బ్రెట్ రాట్నర్ దర్శకత్వం వహించారు.