క్యూబాకు ఆయిల్ విక్రయిస్తే టారిఫ్ లు:అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్  

Spread the love

రెండో సారి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి తన చర్యలతో తరచుగా ఏదొక దేశం మీద విరుచుకుపడుతున్న డొనాల్డ్ ట్రంప్ ఇక ఈసారి క్యూబా పై పడ్డారు. ఆ దేశం టార్గెట్ గా కీలక నిర్ణయం తీసుకున్నారు. క్యూబాకు ఆయిల్ విక్రయించే ఏ దేశం మీదైనా టారిఫ్ లు విధిస్తానని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం కూడా చేశారు. క్యూబా విషయంలో నేషనల్ ఎమర్జెన్సీ పరిస్థితి కింద ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ దేశ ప్రభుత్వం అమెరికా జాతీయ ప్రభుత్వానికి ముప్పుగా మారిందని అన్నారు. ఇక ఈ ఉత్తర్వులు నేటి అర్ధరాత్రి నుండి అమలులోకి రానున్నాయి. ట్రాంప్ తీసుకున్న ఈ నిర్ణయం మెక్సికోపై ఒత్తిడి పెంచనుంది. క్యూబా ప్రభుత్వం నుండి దూరం కావాలని ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవలే మెక్సికో దేశాధ్యక్షురాలు క్లాడియా షేన్ బామ్ క్యూబాకు ఆయిల్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అయితే అమెరికా ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. మరోవైపు కెనడా పైనా ట్రంప్ తన దూకుడు పెంచారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే కెనడా విమానాలకు 50 శాతం టారిఫ్ విధిస్తామని హెచ్చరించారు. జార్జియా కేంద్రంగా పనిచేస్తున్న అమెరికాకు చెందిన గల్ఫ్ స్ట్రీమ్ ఏరోస్పేస్ జెట్లకు సర్టిఫై చేసేందుకు కెనడా నిరాకరించిందని ట్రంప్ ట్రూత్ సోషల్ లో పేర్కొన్నారు. దీన్ని వెంటనే సరిదిద్దుకోకపోతే  టారిఫ్లు విధింపు ఉంటుందని  హెచ్చరించారు. వీటిపై కెనడా ఇంకా స్పందించలేదు.