5 కోట్ల మంది ప్రజలను ఊరించి ఉసూరు మనిపించిన బడ్జెట్:ఏపీసీసీ చీఫ్  షర్మిల

Spread the love

ఎన్డీయేలో ఏపీ సీఎం చంద్రబాబు కీలకంగా ఉన్నా.. రాష్ట్రానికి ప్రయోజనం గుండు సున్నా. బాబు అండతో ప్రధానిగా నిలబడ్డ మోడీ .. ప్రతి సారి బడ్జెట్ లో మనకు చేస్తున్నది ఘరానా మోసమేనంటూ ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. 50 లక్షల కోట్ల బడ్జెట్ లో ఈ సారి సైతం రాష్ట్రానికి మొండి చెయ్యే. ఆంధ్రుల ఆత్మగౌరవానికి, రాష్ట్ర  ప్రయోజనాలకు బడ్జెట్ లో అనాపైస మందం విలువ లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ ను దగా చేసిన బడ్జెట్. 5 కోట్ల మంది ప్రజలను ఊరించి ఉసూరు మనిపించిన బడ్జెట్ అని దుయ్యబట్టారు. అమరావతికి మళ్ళీ అప్పులే తప్ప ఆపన్నహస్తం అందించలేదు. వెనకబడిన ఉత్తరాంధ్రకు ఊతమివ్వలేదు. రాయలసీమకు మోసమే తప్ప చిల్లిగవ్వ దక్కలేదని విమర్శించారు.  జీవనాడి పోలవరానికి జీవం పోయలేదు. విభజన హామీల్లో ఒక్క దానికి పట్టింపులేదు. ప్రత్యేక హోదాపై, విశాఖ స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మెట్రో రైలు, ఇండస్ట్రియల్ కారిడార్ల సంగతి తేల్చలేదు. పట్టుమని 10 పైసల మందం కూడా బడ్జెట్ తో ప్రయోజనం లేదని ఆక్షేపించారు. ఢిల్లీ తలదన్నే రాజధాని కడతామని అప్పులు అంటగట్టడం దుర్మార్గం. లక్ష కోట్లు ఖర్చయ్యే అమరావతికి ADB, జపాన్ బ్యాంకుల నుంచి 15 వందల కోట్లు అప్పులిప్పిస్తే రాజధాని పూర్తవుతుందా ? అని ప్రశ్నించారు. గతేడాది అప్పుల కింద ఇస్తామని చెప్పిన 15 వేల కోట్లలో ఒక్క రూపాయి అయినా ఇచ్చారా ? గ్యారెంటీ కింద అప్పులు అంటే..ఎవరికి గ్యారెంటీ ? విభజన చట్టం ప్రకారం అమరావతి నిర్మాణం కేంద్రానిదే బాధ్యత అని తెలియదా ? అప్పులు ఇస్తామని చెప్తే ఆంధ్రుల ఆత్మగౌరవం ఎప్పడు పూర్తవుతుంది ? ఇదేనా బీజేపీ కి రాష్ట్రంపై ఉన్న చిత్తశుద్ధి ? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్ కి మళ్ళీ తీరని అన్యాయం చేశారన్నారు. గత బడ్జెట్ లో ప్రాజెక్ట్ పూర్తికి  ఇస్తామని చెప్పిన 12 వేల కోట్లలో ఇచ్చింది 5 వేల కోట్లే. ఈ ఏడాది 3 వేల కోట్లు మాత్రమే ఇస్తే 2027 నాటికి ప్రాజెక్టు ఎలా పూర్తి అవుతుంది ? మిగిలిన నిధుల సంగతి ఏంటి ? 20 వేల కోట్ల  R&R ప్యాకేజీ మిగులు కోసం పోలవరానికి, రాష్ట్రానికి  తీరని అన్యాయం చేస్తుంటే కూటమి ప్రభుత్వం మౌనంగా ఉండటం సిగ్గుచేటని కూటమిలో పెద్దన్నగా చెప్పుకొనే చంద్రబాబు గారు నోరు మెదపక పోవడం ఆయన పాలన తీరుకి నిదర్శనమని షర్మిల ఒక ప్రకటనలో పేర్కొన్నారు.