యూత్ లో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్ ఇప్పుడు కొంతకాలంగా మాత్రం ఒక బలమైన కమర్షియల్ హిట్ కోసం ఆయన ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ‘కింగ్‌డమ్’ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం దర్శకుడు రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్న ‘రౌడీ జనార్దన్’ సినిమా విజయ్ కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రంగా నిలవనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘రౌడీ జనార్దన్’ ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఇప్పటివరకు విజయ్ చేసిన సినిమాలకంటే భిన్నమైన ప్రపంచాన్ని ఈ సినిమా పరిచయం చేయబోతుందని టాక్. విజయ్‌ను పూర్తిగా కొత్త అవతారంలో చూడబోతున్నామని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను ఎంపిక చేయడం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా మారింది. నటీనటుల ఎంపిక విషయంలో దర్శకుడు రవికిరణ్ కోలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కథలో భావోద్వేగాలకు కీలకమైన పాత్రల కోసం అనుభవజ్ఞులైన నటులను ఎంపిక చేయాలని ఆయన ప్రత్యేకంగా ప్రయత్నిస్తున్నారట. ఈ క్రమంలో సీనియర్ నటి శోభన ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారన్న వార్త సినిమాకు మరింత ప్రాధాన్యం తెచ్చింది. ఆమె పాత్ర కథలో కీలక మలుపులు తీసుకువచ్చే విధంగా ఉంటుందని సమాచారం. అలాగే సీనియర్ హీరో రాజశేఖర్ కూడా ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించే అవకాశాలున్నాయని టాక్ నడుస్తోంది. ఆయన పాత్ర యాక్షన్‌తో పాటు బలమైన భావోద్వేగాన్ని కలిగించి, కథకు మరింత వెయిట్ తీసుకువస్తుందని చెబుతున్నారు. ఇలాంటి భారీ తారాగణం సినిమాకు ప్లస్‌గా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా ద్వారా విజయ్ మరోసారి తన స్టామినాను నిరూపిస్తాడా? యూత్‌తో పాటు మాస్ ప్రేక్షకులను కూడా థియేటర్లకు రప్పిస్తాడా? అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.