అగ్రదర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం ‘వారణాసి’ గురించి రోజురోజుకూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా కథ, నేపథ్యం వంటి అంశాలను అత్యంత రహస్యంగా ఉంచిన రాజమౌళి, తాజాగా హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందనే ప్రచారానికి ఆయన జవాబిచ్చారు. ఒకే భాగంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చిత్రంలోని ప్రధాన నటీనటులు మహేష్‌బాబు, ప్రియాంక చోప్రా, అలాగే ప్రతినాయకుడిగా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ముఖ్యంగా మహేష్‌బాబు తన పాత్ర గురించి మాట్లాడిన విధానం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కోసం దాదాపు ఏడాది పాటు ప్రత్యేకంగా సిద్ధమయ్యానని ఆయన తెలిపారు. సినిమాలోని ఒక కీలక ఘట్టంలో తాను శ్రీరాముడిగా కనిపించనున్నట్టు మహేష్‌బాబు వెల్లడించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆ పాత్ర కోసం శారీరకంగా పూర్తిగా మారాల్సి వచ్చిందని, గెటప్ నుంచి నిలబడే తీరు వరకు ప్రతి అంశంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నానని చెప్పారు. రెండు నుంచి మూడు నెలలు కేవలం ఆ సిద్ధత కోసమే కష్టపడ్డానని, తాను పరిగెత్తే విధానాన్ని కూడా రాజమౌళి మార్చారని పేర్కొన్నారు.