ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు రూ.12,967 కోట్ల 10 రైల్వే ప్రాజెక్టులు పూర్తి

Spread the love

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు రూ.12,967 కోట్ల 10 రైల్వే ప్రాజెక్టులు పూర్తయినట్లు అలాగే ప్రస్తుతం రూ.34,680 కోట్ల విలువైన 16 ప్రాజెక్టులు జరుగుతున్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్ లో తెలిపారు. టీడీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాస్ రెడ్డి, పుట్టా మహేష్ యాదవ్ లు అడిగిన వేర్వేరు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. గడిచిన నాలుగు సంవత్సరాలలో 15 కొత్త రైల్వే లైన్లు, 50 డబ్లింగ్ లైన్లకు సర్వే పనులు చేసినట్లు తెలిపారు. వీటి మొత్తం పొడవు 6,985 కిమీ అని పేర్కొన్నారు. 2025 ఏప్రిల్ నాటికి ఏపీకి 4,499 కిమీ పొడవైన 12 కొత్త లైన్లు, 27 డబ్లింగ్ పనులు మంజూరైనట్లు వివరించారు. వాటి విలువ రూ.70,232 కోట్లని వివరించారు. అందులోని 1178 లైన్లు 

మొదలయ్యాయని, వాటికొరకు  రూ.28,039 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.  గుంటూరు డివిజన్ గుంటూరు-గుంతకల్లు 401 కి.మీ., గుంటూరు-బీబీనగర్ 239 కి.మీ. డబ్లింగ్ పనులు, గుంటూరు యార్డ్ కు  మల్టీ ట్రాకింగ్, ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య 57 కి. మీ. పొడవైన కొత్తలైన్ల నిర్మాణ పనులు మొదలుపెట్టినట్లు వివరించారు. ఈ మొత్తం ప్రాజెక్టుల విలువ రూ.9,353 కోట్లని తెలిపారు. ఇందులో గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్ పనులు 357 కి.మీ. పూర్తయ్యాయని, మిగిలిన పనులు జరుగుతున్నాయని తెలిపారు. అమరావతి లైన్ కోసం భూసేకరణ ప్రక్రియ చేపట్టినట్లు వివరించారు. గుంటూరు-బీబీనగర్ డబ్లింగ్ పనులు కూడా జరుగుతున్నాయన్నారు. రూ.3,796 కోట్ల విలువైన 119 కి.మీ భద్రాచలం-కొవ్వూరు కొత్తలైన్ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్రాలు చెరొక సగం వ్యయాన్ని పంచుకొనే పద్ధతిలో మంజూరు చేశామని, అందులో ఇప్పటివరకు 56 కి.మీ భద్రాచలం-సత్తుపల్లి మధ్య లైన్ నిర్మాణం పూర్తయిందని పేర్కొన్నారు.