అమరావతి వేదికగా దేశంలోనే మొట్టమొదటి క్వాంటం వ్యాలీ

Spread the love

భారత దేశ తొలి క్వాంటం ఎకోసిస్టం అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు,, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ పాల్గొన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం 50 ఎకరాల భూమిని కేటాయించింది. భారతదేశంలోనే తొలి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్‌ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో ఐబీఎం (IBM), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సెన్ అండ్ టూబ్రో (L&T) వంటి దిగ్గజ సంస్థలు భాగస్వాములుగా వ్యవహరించనున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు  పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం  చంద్రబాబు మాట్లాడుతూ, 1990లలో భారత్‌ ను ఐటీ లీడర్‌గా నిలబెట్టడంలో ముందున్నట్లే, ఇప్పుడు అమరావతి నుంచి దేశాన్ని క్వాంటమ్ లీడర్‌గా నిలబెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. బోస్టన్, సింగపూర్, షాంఘై వంటి గ్లోబల్ క్వాంటమ్ కేంద్రాల సరసన అమరావతిని నిలపాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, రక్షణ, వైద్యం, ఆర్థిక రంగాల్లో పరిశోధనలకు, ఆవిష్కరణలకు ఈ వ్యాలీ సెంటర్ గా మారనున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 88,000 ఉద్యోగాలు సృష్టించవచ్చని అంచనా వేస్తున్నారు.