అమెరికాతో ఇటీవలే వాణిజ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. కాగా, కొత్త వాణిజ్య ఒప్పందంతో రానున్న ఐదేళ్లలో రూ.45,28,822 కోట్ల దిగుమతులు చేసుకోవడం సులభతరం కానుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికాతో ఇంటెరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఫ్రేమ్ వర్క్ ఖరారైన నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 18 శాతం టారిఫ్ లు ఎదుర్కొంటున్న మన భారతీయ ప్రొడక్ట్స్ ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా మార్కెట్లలో బాగానే లబ్దిపొందుతాయని అన్నారు. మనతో పోటీపడే చైనాపై 35 శాతం, ఇతర ఆసియా దేశాలపై 19 శాతం టారిఫ్ లు ఉన్నాయి. మనం ప్రపంచంలోని అన్ని దేశాల నుండి దిగుమతులు చేసుకుంటున్నాం. రానున్న ఐదేళ్లలో ఇవి రూ.181.15 లక్షల కోట్లకు చేరనున్నాయి. అందుకే భారత్ లో డిమాండ్ ఉందని అమెరికా ప్రతినిధులకు చెప్పినట్లు తెలిపారు. టారిఫ్ లు తగ్గించడం ద్వారా పోటీపడాలని సూచించినట్లు వివరించారు. భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా ముందుకుపోతుంది. అందువల్ల ప్రత్యేక రంగాల్లో దిగుమతులకు డిమాండ్ పెరుగుతోంది. సెమీ కండక్టర్ చిప్స్, హై ఎండ్ మెషీన్స్, డేటా సెంటర్ డివైసెస్, విమానాలు, విమాన విడి భాగాలూ, ఇంధన పరికరాలకు డిమాండ్ ఉంటుందన్నారు. మనతో పోటీపడే దేశాలతో పోలిస్తే టారిఫ్ లు మనపైనే తక్కువగా ఉన్నాయని అమెరికా వాణిజ్య ఒప్పందంతో మన రైతులకు, మత్స్యకారులకు ప్రయోజనం కలుగుతుందని పునరుద్ఘాటించారు. భారత-అమెరికా తాత్కాలిక ఒప్పంద ఫ్రేమ్‌వర్క్ (Interim Agreement framework), ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే మన ప్రయాణానికి బలాన్ని చేకూరుస్తుంది.