ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు పారదర్శకమైన పాలన, అభివృద్ధి, సంక్షేమం అందించేందుకు నిబద్ధతతో పని చేస్తోంది. ప్రధాని మోడీ సహకారం, సీఎం చంద్రబాబు అనుభవం మార్గదర్శకాలుగా ముందుకు వెళ్తున్నామన్నారు. దీనికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేయాల్సిన అవసరం ఉందని పవన్ స్పష్టం చేశారు. నాలుగు గోడల మధ్య మంత్రులు, ఉన్నతాధికారులు తీసుకునే ప్రజోపయోగ నిర్ణయాలు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అర్ధవంతంగా అందాలంటే అంతా సమష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాజీపడటం లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేసే ప్రతి రూపాయి విలువైనదేనని పెట్టే ఖర్చు, దానివల్ల అందే ప్రయోజనం ప్రజలకు ఉపయోగపడేలా క్షేత్రస్థాయి సిబ్బంది పని చేయాలి. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పన మీద దృష్టిపెట్టాం. ఇందులో భాగంగా మొదటి విడత పల్లె పండుగ కార్యక్రమం కింద రూ.2,500 కోట్లు, పల్లె పండుగ 2.0 కింద రూ.5,700 కోట్లు ఖర్చు చేశాం. గిరిజన ప్రాంతాల్లో సౌకర్యాలను మెరుగుపర్చే కార్యక్రమం ‘అడవి తల్లి బాట’ పథకం కింద రూ.1005 కోట్లను ఖర్చుచేసినట్లు తెలిపారు. దీంతోపాటు సాస్కీ నిధులు రూ.2,123 వేల కోట్లతో నియోజక వర్గాల్లో ప్రాధాన్యతను బట్టి పనులు చేస్తున్నాం. మొత్తంగా రూ.11,328 కోట్లతో చేస్తున్న పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జల్ జీవన్ మిషన్ పథకం కింద రూ.28 వేల కోట్ల పనులకు అనుమతులు లభిస్తే, దానిలో రూ.10 వేల కోట్ల పనులను ప్రారంభించాం. ఇక అటవీ శాఖ పరిధిలో రూ.200 కోట్లతో నగరవనాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా అనేక పనులను పారదర్శకంగా క్రమపద్ధతిలో, ప్రాధాన్యతలను అనసరించి చేస్తున్నట్లు వివరించారు. నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.