ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో ఏపీ సీఎం చంద్రబాబు నేడు భేటీ అయ్యారు. వివిధ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సాయం, అంతర్రాష్ట్ర వివాదాలు, పెండింగ్‌లో ఉన్న అంశాలతో పాటు, పరిష్కారంపైనా సవివరంగా చర్చించారు.పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్టాప్ వర్క్ ఆర్డర్ శాశ్వతంగా ఎత్తివేసేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యం పెంపు కారణంగా పెరిగిన వ్యయాన్ని రీయింబర్స్మెంట్ చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు ఫేజ్–IIకి ఆర్థిక సహాయం అందించాలి. ఫేజ్–IIలో భూసేకరణ, పునరావాసం, రక్షణ కట్టలు వంటి పనులు చేపట్టాల్సి ఉందని వీటికి అదనంగా సుమారు రూ.32,000 కోట్ల నిధులు అవసరమని పేర్కొన్నారు. జాతీయ నదుల అనుసంధాన విధానంలో భాగంగా పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వంశధార నీటి వివాద ట్రిబ్యునల్ (వీడబ్ల్యుడీటీ) తుది నివేదిక గెజెట్‌లో ప్రచురించాలన్నారు. నదీ జలాల పంపకం కోసం గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు. ఎగువ కృష్ణాపై ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు నిలుపుదల చేయాలన్నారు.