నిన్న పార్లమెంట్ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఆసక్తికర సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో రాహుల్ గాంధీ అక్కడికి వచ్చారు. దీంతో వారు అక్కడ నుండి వెళ్లిపోయారు. కలిసి మాట్లాడుదాం ఉండండంటూ రాహుల్ గాంధీ వారిని ఆపేందుకు ప్రయత్నించారు. అయినా ఆగకుండా వెళుతున్న ప్రహ్లాద్ జోషిని చేయిపట్టుకుని ఆపేందుకు ప్రయత్నించినా ఆయన విడిపించుకుని వెళ్లిపోయారు. ఇదంతా చూసి రాహుల్ గాంధీతో పాటు ఆయన వెన్నంటి ఉన్న సహచర ఎంపీలు నవ్వడం వీడియోలో కనిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి బీజేపీ, కాంగ్రెస్ అభిమానుల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కొందరు రాహుల్ గాంధీకి మద్దతుగా మాట్లాడుతుంటే కొందరు ఇలా ప్రవర్తించిన తీరు సరికాదని అంటున్నారు. మొత్తానికి రెండు పార్టీల మద్దతుదారులు ఈ వీడియోపై తమదైన రీతిలో స్పందిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.