ఏపీ సీఎం చంద్రబాబును అసెంబ్లీలోని ఆయన ఛాంబర్‌లో బండ్ల గణేష్ ఈరోజు కలిశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో సీఎం చంద్రబాబు జైలు నుంచి విడుదలై ముఖ్యమంత్రి అయితే తిరుమలకు పాదయాత్రగా వస్తానని బండ్ల గణేష్ మొక్కుకుని ఇటీవల తన యాత్రను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. సంకల్ప యాత్ర పేరుతో షాద్‌నగర్ ఇంటి నుంచి జనవరి 19న పాదయాత్ర చేపట్టి ఈ నెల 10వ తేదీన తిరుమలకు చేరుకున్నారు. 23 రోజుల పాటు 535 కి.మీ మేర బండ్ల గణేష్ పాదయాత్ర సాగింది. రెండ్రోజుల క్రితం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని బండ్ల గణేష్ తన మొక్కును చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో నేడు అమరావతిలో సీఎం చంద్రబాబును కలిశారు. తిరుమల నుండి తీసుకువచ్చిన శ్రీవారి ప్రసాదాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. బండ్ల గణేష్‌ను సీఎం చంద్రబాబు ఆత్మీయంగా పలకరించి ఆలింగనం చేసుకున్నారు. పాదయాత్ర సాగిన తీరును సీఎంతో బండ్ల గణేష్ పంచుకున్నారు. దారి పొడవునా పార్టీ కార్యకర్తలు అండగా నిలిచి తనతో నడిచారని, వారి ప్రోత్సాహంతో తాను మరింత ఉత్సాహంగా పాదయాత్ర చేస్తూ తిరుమలకు చేరుకున్నానని బండ్ల గణేష్ సీఎంకు వివరించారు.