సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించారు. గుంటూరు ప్రిన్సిపల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల పేరిట చేసిన వసూళ్లపై నమోదైన కేసులో గుంటూరు ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి నేడు పీటీ వారంట్ జారీ చేశారు. ఈ నెల 18లోగా కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. దీంతో ఈరోజు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి పీటీ వారెంట్ పై తీసుకొచ్చి గుంటూరు కోర్టులో హాజరు పర్చారు. కేసు వివరాలు పరిశీలించిన న్యాయమూర్తి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు రాంబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. వివరాల్లోకి వెళితే 2023 జనవరిలో అంబటి సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఇందుకోసం అక్కడి వాలంటీర్ల ద్వారా పింఛనుదారులకు నెలవారీగా ఇచ్చే పింఛను మొత్తం నుంచి రూ.200 చొప్పున మినహాయించుకుని రెండేసి లాటరీ టికెట్లు ఇచ్చారు. సంక్రాంతి రోజు లాటరీ తీసి గిఫ్ట్స్ పంచారు. ఇది చట్టవిరుద్ధమని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు గుంటూరు ప్రధాన సీనియర్ సివిల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు అప్పట్లో సత్తెనపల్లి పట్టణ పోలీసులు రాంబాబుతో పాటు మరికొందరిపై కేసు నమోదైంది.