తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కాగా, తొలిసారిగా జనసేన పార్టీ పోటీ చేసిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా, నేరేడుచర్ల మున్సిపాలిటీ 14వ వార్డు అభ్యర్థి శ్రీమతి ఆరూరి విజయలక్ష్మి ఆ పార్టీ నుండి ఎన్నికైన తొలి కౌన్సిలర్ గా నిలిచారు. ఈ సందర్భంగా ఈ విజయం సాధించిన వారికి జనసేన తెలంగాణ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి అభినందనలు తెలిపారు. జాతీయ మహిళా దినోత్సవం రోజున, మహిళలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చే జనసేన పార్టీ తరపున, మహిళా ద్వారా తొలి విజయాన్ని అందుకోవడం గర్వంగా ఉందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పూర్తితో, ఆయన ఇచ్చిన ధైర్యంతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతీ ఒక్కరికి, పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్న ప్రతీ ఒక్క జనసైనికులకు, వీరమహిళలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా సరే, మరింత ఉత్సాహంతో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ నెల రోజులు నాకు సహకరించిన ప్రతీ ఒక్క నాయకులకు, పార్టీ శ్రేణులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ, రానున్న రోజుల్లో మరింత బలంగా తెలంగాణలో జనసేన జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.