కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ది, ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటుంది:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ 

Spread the love

పాలక మండళ్లు బాధ్యతగా ఉంటే ఆలయాల్లో అపచారాలు జరగవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పాలక మండళ్లపై ఉందని పేర్కొన్నారు.  కొత్తగా నిర్మించిన శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ రోడ్డును వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ గా ఈరోజు పవన్ ప్రారంభించారు. సుమారు రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో గిరి ప్రదక్షణ రోడ్డును నిర్మించారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, దేవాదాయ శాఖ కార్యదర్శి డాక్టర్ హరి జవహర్ లాల్ పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తిరుమలలోనే ఎన్నో అపచారాలు జరిగాయన్నారు. నాటి పాలక మండలి బాధ్యతగా వ్యవహరిస్తే తప్పులు జరిగేవి కాదని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఆలయ పాలక మండళ్లు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు, అపచారాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  శివరాత్రికి రెండు రోజుల ముందు ఈ శ్రీకాళహస్తి గిరి ప్రదక్షణ మార్గాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. గత ప్రభుత్వం ఆలయాల పరిరక్షణ అంశాన్ని చాలా నిర్లక్ష్యం చేసిందని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దేవాదాయ మంత్రిగా రామనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ఆలయాల పరిరక్షణను ఎంతో బాధ్యతగా ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు.  నిరాదరణకు గురైన ఎన్నో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారు. భక్తులు కోరుకుంటే ఏజెన్సీలో కూడా ఆలయాలు నిర్మించాలన్న ఆయన గొప్ప సంకల్పానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నమన్నారు. శివరాత్రి తర్వాత గిరిప్రదక్షణ మార్గంలో మొక్కలు నాటుతామని తెలిపారు.  కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి అడుగులో మన సనాతన ధర్మ ఔన్నత్యాన్ని పరిరక్షించేందుకు కృషి చేస్తూ.. ఆలయాలు, ఆలయాలకు వెళ్లే రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో చేపట్టిన వివిధ ఆలయాల రోడ్లకు సంబంధించి మాట్లాడారు.  ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్, సాస్కీ నిధులతో రూ. 40 కోట్లకు పైగా వెచ్చించి సుమారు 22 ప్రధాన దేవాలయాలకు రోడ్డు వసతి కల్పిస్తున్నాం. మరెన్నో చిన్న ఆలయాలకు రవాణా సౌకర్యాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.  నూతన శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో అరుణాచలం మాదిరి ప్రతి పౌర్ణమికీ ప్రత్యేకంగా శ్రీకాళహస్తి కైలాసగిరి ప్రదక్షణ నిర్వహించాలని సూచిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికీ, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని అన్నారు.