కరీంనగర్లో బీజేపీ చరిత్ర సృష్టించింది. నగరంలో తొలిసారిగా బీజేపీ మేయర్ ప్రమాణ స్వీకారం చేశారు. కరీంనగర్ తొలి బీజేపీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన కొలగాని శ్రీనివాస్ మరియు డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన వై. సునీల్ రావులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ రోజు కేవలం ఒక రాజకీయ విజయం మాత్రమే కాదు. ఇది ఒక భావోద్వేగ క్షణం. మనలో చాలా మంది ఏళ్ల తరబడి గుండెల్లో దాచుకున్న కల నిజమైనట్లుగా ఉందని ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. అభివృద్ధిని కోరుకుంటూ, ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతపై నమ్మకం ఉంచిన ఓటర్లకు తలవంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. ఒక కార్పొరేటర్‌గా వార్డు వార్డుకూ తిరిగిన స్థాయి నుండి.. ఈ రోజు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగురుతుండగా, ఒక బీజేపీ మేయర్ ప్రమాణ స్వీకారం చేయడాన్ని సాక్షిగా చూడటం నా వ్యక్తిగత విజయంలా అనిపిస్తోంది. నేను ఈ ప్రయాణంలో భాగమయ్యాను. ఈ క్షణం వెనుక ఉన్న పోరాటాన్ని కళ్లారా చూశాను. ఇది నా పార్టీ. ఇది నా బీజేపీ. సామాన్య కార్యకర్తలను అక్కున చేర్చుకుని, వారిని చరిత్రకు సాక్షులుగా నిలబెట్టే పార్టీ ఇది.ఈ విజయం, ఈ పోరాటం కోసం తమ చెమటను, శక్తిని ధారపోసిన ప్రతి కార్యకర్తది. ఎన్నో ఒత్తిళ్లు, బెదిరింపులు, అవమానాలను ఎదుర్కొన్నా.. ఎక్కడా తలవంచని మీకు ఈ రోజు అంకితం. మీరు కేవలం ప్రచారం చేయలేదు, ఒక నమ్మకాన్ని మీ భుజాలపై మోశారని పేర్కొన్నారు. మజ్లిస్ పార్టీ కార్యాలయం ఉన్న వార్డులోనే మన కార్యకర్తలు కాషాయ జెండాను ఎగురవేశారు. ఆ దృశ్యం నా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. అది ధైర్యానికి నిదర్శనం.. అది మార్పుకు సంకేతం.ఎన్ని కుట్రలు చేసినా, ఒత్తిళ్లు తెచ్చినా, మన స్థైర్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించినా.. బీజేపీ దృఢంగా నిలబడింది. మేము వెనకడుగు వేయలేదు, రాజీ పడలేదు. గెలుస్తామని చెప్పాం.. గెలిచి తీరాం అంటూ పేర్కొన్నారు.