బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణస్వీకారం

Spread the love

బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణస్వీకారం చేశారు. తారిఖ్ రెహమాన్ తో పాటు పలువురు క్యాబినెట్ మంత్రులతో ప్రమాణం చేశారు. అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ వారితో ప్రమాణం చేయించారు. 35 సంవత్సరాల తరువాత బంగ్లాదేశ్ కు మొదటి పురుష ప్రధానిగా రెహమాన్ ఎన్నికయ్యారు. గత 35 ఏళ్లుగా మహిళా ప్రధానులే బంగ్లాదేశ్ ప్రధాని పీఠంపై కొనసాగారు. అవామీ లీగ్ అధినేత నేత షేక్ హసీనా, బీఎన్ పీ నాయకురాలు ఖాలిదా జియాలే ఆ కాలంలో దేశానికి నాయకత్వం వహించారు. ఇప్పుడు బీఎన్పీ ఛైర్మన్ గా ఉన్న తారిఖ్ రెహమాన్ 35 ఏళ్ల తర్వాత ఆ పదవిని అధిష్ఠించిన పురుష ప్రధానిగా నిలిచారు. ఖాలిదా జియా కుమారుడైన రెహమాన్ 2008లో బంగ్లాదేశ్ విడిచి వెళ్లారు. 17 ఏళ్ల పాటు బ్రిటన్ లో ప్రవాస జీవితం గడిపారు. గతేడాది డిసెంబరులోనే స్వదేశానికి వచ్చారు. తల్లి మరణం అనంతరం  పార్టీ బాధ్యతలు స్వీకరించి బీఎన్ పీని గెలుపు బాట పట్టించారు. ఎన్నికల్లో తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఆయన గెలుపొందారు. 299 పార్లమెంట్ స్థానాలకుగానూ 209 చోట్ల పార్టీ గెలిచింది. 2024లో హసీనా ప్రధాని పదవిని కోల్పోయిన తర్వాత నేడు బంగ్లాదేశ్ లో తిరిగి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పడింది.