తిరుమల పవిత్రతను దెబ్బతీసి కోట్ల మంది హిందువుల మనోభావాలతో ఆడుకున్న వైసీపీ నాయకులకు ఈరోజు శాసనమండలిలో అసలు మాట్లాడే నైతిక హక్కు లేదని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ జరిగిందని గతంలో టీటీడీ చైర్మన్ గా చేసిన సుబ్బారెడ్డి గారే స్వయంగా ఒప్పుకున్నారని ఈ అపచారంపై ప్రస్తుతం సిట్ విచారణ కొనసాగుతోందన్నారు. అసలు విషయంలో సమాధానం చెప్పలేక, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఏమాత్రం సంబంధం లేని హెరిటేజ్ సంస్థ పేరును ఈ వివాదంలోకి లాగడం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి హిందూ సంప్రదాయాలను కాలరాస్తూ తిరుమలను అపవిత్రం చేసిన తీరును యావత్ దేశం ఛీత్కరిస్తోందని ఫైర్ అయ్యారు.ప్రజల దృష్టిని మళ్లించేందుకు మీరు ఎన్ని కుట్రలు చేసినా నిజం దాగదు. భక్తుల నమ్మకంతో ఆడుకున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని మీరు స్వామివారి లడ్డూని కల్తీ చేసి, అడ్డంగా సీబీఐ సిట్‌కు దొరికిపోయి, సంబంధం లేని హెరిటేజ్‌ను లాగుతారా? అని వైసీపీని ప్రశ్నించారు.