ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు నేడు కీలక వ్యాఖ్యలు చేసింది. తమిళనాడుకు సంబంధించి ఉచిత విద్యుత్ ప్రతిపాదనపై దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా ఎన్నికల ముందే రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు ఎందుకు తీసుకొస్తున్నాయని ప్రశ్నించింది.దేశ ప్రగతికి ఆటంకం కలిగించే ఇటువంటి విధానాలపై తిరిగి పునః సమీక్షించుకోవాలని పేర్కొంది. ఎన్నికలకు సరిగ్గా ముందే ఇలాంటి ఉచిత పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ప్రకటిస్తున్నాయని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది.పేదవారికి, చెల్లించలేని వారికి ఉచితంగా ఇవ్వడం అర్థం చేసుకోవచ్చు కానీ, ఆర్థిక స్థోమత ఉన్నవారికి కూడా ఉచిత విద్యుత్ ఇవ్వడం “బుజ్జగింపు రాజకీయం” కాదా అని నిలదీసింది.ఇప్పటికే అనేక రాష్ట్రాలు రెవెన్యూ లోటులో ఉన్నాయని, ఇలాంటి ఉచితాల వల్ల అభివృద్ధి పనులకు ఒక్క పైసా కూడా మిగలదని కోర్టు వ్యాఖ్యానించింది. కేవలం ఇది ఒక్క తమిళనాడు సమస్యే కాదని, చాలా రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని పేర్కొంది. ఉపాధి కల్పన కోసం కృషి చేయాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ పిటిషన్ పై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.