దాదాపు 122 ఏళ్ల తర్వాత ప్రముఖ ప్రసిద్ధ ప్రాంతమైన ఒడిశా కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడిలోని ఇసుకను తొలగించి, దాన్ని పునరుద్ధరించే ప్రక్రియ తుది దశకు చేరుకుంది.13వ శతాబ్దానికి చెందిన ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కట్టడం లోని జగమోహన హాల్ (గర్భగుడి)లో శతాబ్దాలుగా పేరుకుపోయిన ఇసుకను తొలగించే కీలక కార్యక్రమాన్ని భారత పురావస్తు సర్వే (ASI) చేపట్టింది. ఈ హిస్టారికల్ ప్రాసెస్ రానున్న మూడు నెలల్లో పూర్తికావచ్చని అంచనా వేస్తున్నారు. 1903-04 సంవత్సరంలో బ్రిటిష్ ఆఫీసర్స్ ఆలయ నిర్మాణాన్ని పటిష్టంగా ఉంచేందుకు ఈ గర్భగుడిని పూర్తిగా ఇసుకతో నింపేశారు. ఆలయం వెనుక భాగంలోని గోడ బలహీనపడి, పగుళ్లు ఏర్పడటంతో, అది కూలిపోకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుండి ఈ హాల్లోకి భక్తులకు గానీ, విజిటర్స్ కు ప్రవేశం లేదు. కాగా, ప్రస్తుతం ఏఎస్ఐ, ఐఐటీ మద్రాస్ ఎక్స్పర్ట్స్ తో కూడిన 30 మంది సభ్యుల బృందం ఈ కఠినతరమైన పనిని శాస్త్రీయ పద్ధతిలో చేస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఆలయ గోడలకు ఎలాంటి నష్టం కలగకుండా ఇసుకను బయటకు తీస్తున్నారు. దేశంలో అత్యధికంగా టూరిస్ట్ లను ఆకర్షిస్తున్న స్మారకాల్లో కోణార్క్ ప్రముఖమైనది. ఏటా లక్షల మంది ఇక్కడికి వస్తుంటారు.