చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు:హరీష్ రావు

Spread the love

రేవంత్ సర్కార్ పై బీ.ఆర్.ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఆదిలాబాద్ సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ను పరామర్శించిన హరీష్ రావు.అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న విద్యార్థి నాయకుడు బాల్క సుమన్‌తో పాటు రాజిరెడ్డి, అనిల్ లక్ష్మీకాంత్‌లను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని ఆరోపించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లితో పాటు ఆసిఫాబాద్‌లో జైళ్లు ఉన్నప్పటికీ.. వాళ్లను అక్కడ పెట్టకుండా కక్షపూరితంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్ జైలుకు తీసుకువచ్చి పెట్టడం దుర్మార్గమన్నారు. క్యాతన్‌పల్లిలోని 22 స్థానాలకు గాను 14 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. బీఆర్ఎస్, సీపీఐ కూటమిని ప్రజలు గెలిపించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును మంత్రి వివేక్ గారు శిరసావహించాల్సింది పోయి, ఇలా ప్రజా తీర్పును కాలరాయడం సరికాదన్నారు.  కోరం ఉన్నప్పటికీ చైర్మన్ ఎన్నిక రోజు కావాలనే పోలీసు బందోబస్తు లేకుండా చేసి, చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదా పడేలా చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కేవలం నాలుగే మున్సిపాలిటీలు గెలిచింది. మేము ఇప్పుడు దాదాపు 800 మంది కౌన్సిలర్లను గెలుచుకున్నాం. అప్పుడు మేం ఏనాడూ ఇలా చేయలేదు.అక్రమంగా పోలీసులను అడ్డం పెట్టుకుని దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీల మైత్రి ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నాయకుడు, బీజేపీ ఎంపీ పోలీసులను పట్టుకుని అడ్డగోలుగా బూతులు తిట్టినా ఇప్పటివరకు వారిని అరెస్ట్ చేయలేదని అన్నారు. రాహుల్ గాంధీ ఈరోజు ఢిల్లీలో తెలంగాణ క్యాబినెట్‌ తో రివ్యూ చేస్తున్నారు. దేశంలో ఎక్కడికి పోయినా చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో ప్రజాభిప్రాయాన్ని ఖూనీ చేస్తున్న రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? ఇదేనా రాజ్యాంగాన్ని పరిరక్షించడం అంటే? అని ప్రశ్నించారు. తెలంగాణలో పట్టపగలు రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించరు? రాష్ట్ర ఇంచార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ ఎందుకు నోరు విప్పరు?అని హరీష్ ప్రశ్నించారు. ప్రజా తీర్పును కాలరాసినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తాయని అధికారం శాశ్వతం కాదు. అన్ని కాలాలు ఒకే తీరుగా ఉండవు. కాలం మారుతుంది, రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. పోలీసు అధికారులకు మేము చెప్పేదొకటే.. పోస్టింగ్‌ల కోసం నాయకుల చెప్పుచేతల్లో పనిచేయకూడదు. చట్టాన్ని అతిక్రమించి, పరిధులు దాటి బీఆర్ఎస్ నాయకుల పట్ల అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులు తీవ్ర మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందన్నారు.  చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *