తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి దాదాపు సగం కాలం పూర్తవుతున్న సందర్భంగా కేటీఆర్ ఈ లేఖ రాశారు. ఇప్పటికీ కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో 95 శాతం పెండింగ్ లోనే ఉన్న నేపథ్యంలో.. ఈసారైన బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని సూచించారు. లేకపోతే తెలంగాణ సమాజం ఇంకా ఓపికపట్టే ప్రసక్తే లేదని గుర్తుచేశారు. ఈసారి బడ్జెట్ లో అయినా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీల పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చి వాటి అమలును పక్కన పెట్టారని పేర్కొన్నారు. రెండు బడ్జెట్లలో హామీల అమలు కోసం కేటాయింపులు చేయని ప్రభుత్వం.. ఈ బడ్జెట్లో అయినా నిధులు కేటాయించాలన్నారు. ముఖ్యంగా ఆరు గ్యారెంటీలో హామీ ఇచ్చిన మహిళలు, వృద్ధులు, విద్యార్థి, యువత, రైతన్నల కోసం భారీగా నిధులు కేటాయించాలన్నారు. డిక్లరేషన్ల పేరుతో హామీలు ఇచ్చిన మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇస్తామని చెప్పిన నిధుల బకాయిలకు ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయాలి. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకువస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దాన్ని నిలబెట్టుకోవాలని స్పష్టం చేశారు. ఈసారి కూడా హామీల అమలకు నిధులు కేటాయించకుంటే ప్రజల తరఫున ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామని పేర్కొన్నారు. 2026 – 2027 బడ్జెట్‌లో 6 గ్యారెంటీలు, 420 హామీలు, డిక్లరేషన్ల కింద ఇచ్చిన వాగ్దానాల అమలుకు తగిన నిధులు కేటాయించకపోతే, ఎక్కడికక్కడ మోసకారి కాంగ్రెస్ ను ప్రజల పక్షాన నిలదీస్తామన్నారు.