‘ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో తెలంగాణ సీఎం రేవంత్ కీలక ప్రసంగం

Spread the love

దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ‘ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లోతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఏఐ రంగంలో ఉన్న అన్ని అవకాశాలను భారత్ అందిపుచ్చుకోవాలన్నారు. ఏఐ సహా టెక్నాలజీపై కీలక ప్రసంగం చేశారు.  ఏఐ రంగంలో వస్తున్న వేగవంతమైన మరియు విప్లవాత్మక మార్పుల నేపథ్యంలో జీఎస్‌టీ కౌన్సిల్ మరియు నీతి ఆయోగ్ తరహాలో ‘ఇండియా ఏఐ కౌన్సిల్’ ను ఒక అత్యున్నత జాతీయ సంస్థగా ఏర్పాటు చేయాలని  సీఎం రేవంత్ ప్రధానిని కోరారు. జాతీయ భద్రత మరియు ప్రయోజనాల దృష్ట్యా ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు పటిష్టమైన చట్టపరమైన రక్షణలను రూపొందించడానికి ప్రత్యేకంగా ఒక ‘ఏఐ మంత్రిత్వ శాఖ’ను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సామాజిక న్యాయం మరియు పేదరిక నిర్మూలనకు ఏఐ ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడాలని ఆయన నొక్కి చెప్పారు.ఏఐ అభివృద్ధిలో అన్ని రంగాల్లో తెలంగాణతో భాగస్వామ్యం కావాలని ప్రపంచ నాయకులను, సాంకేతిక నిపుణులను ఈ సందర్భంగా  ఆహ్వానించారు. భారత ప్రభుత్వ సహకారంతో దేశం కోసం ‘ఏఐ స్టార్టప్ విలేజ్’ ఏర్పాటు చేయడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు.వేగంగా మారుతున్న సాంకేతిక యుగంలో ఏటా జరిగే చర్చలు సరిపోవని పేర్కొంటూ, వివిధ భారతీయ నగరాల్లో ఏటా రెండుసార్లు ఏఐ సదస్సులు నిర్వహించాలని ప్రతిపాదించారు. అలాగే, స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడానికి మరియు భారతీయ యువత ప్రపంచ స్థాయి ‘యూనికార్న్’ సంస్థలను నిర్మించేలా ప్రోత్సహించడానికి ‘నేషనల్ ఏఐ ఫండ్’ను ఏర్పాటు చేయాలని కోరారు. ఏఐ రేసు ఇప్పటికే మొదలైందని, పారిశ్రామిక విప్లవాన్ని కోల్పోయిన భారత్, ఏఐ విప్లవాన్ని మాత్రం చేజార్చుకోకూడదని పిలుపునిచ్చారు. ఐదు వ్యూహాత్మక ప్రాధాన్యతలను వివరిస్తూ సీఎం రేవంత్  కీలక ప్రతిపాదనలు చేశారు. 

ఏఐ వ్యాల్యూ చైన్: చిప్ తయారీ, గ్రీన్ ఎనర్జీ మరియు డేటా స్టోరేజ్ నుండి ప్లాట్‌ఫారమ్‌లు, కోర్ లాంగ్వేజెస్, అప్లికేషన్లు మరియు సర్వీసెస్ వరకు భారతదేశం నాయకత్వం వహించాలని, దీని కోసం స్పష్టమైన రోడ్‌మ్యాప్ ఉండాలని అన్నారు.

ఏఐ వార్ రూమ్: పరిణామాలను నిరంతరం పర్యవేక్షించడానికి కేంద్రం మరియు రాష్ట్రాలతో కూడిన ‘నేషనల్ ఏఐ వార్ రూమ్’ను ఏర్పాటు చేయాలని, దీనికి ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ సిద్ధంగా ఉందని తెలిపారు.

ఏఐ యూనివర్సిటీ: పరిశోధనల కోసం భారతదేశం అంతటా క్యాంపస్‌లతో కూడిన ప్రపంచ స్థాయి ఏఐ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

GPU చిప్స్: దేశీయంగా జీపీయూ (GPU) చిప్‌ల తయారీని చేపట్టాలని మరియు అరుదైన ఖనిజాల లభ్యతతో సహా ఏఐ సప్లై చైన్‌లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

ఉద్యోగ కల్పన: ఏఐ వల్ల ఉద్యోగాలు పోకుండా, కొత్త ఉద్యోగ అవకాశాలు పెరిగేలా సమగ్రమైన ‘రీస్కిల్లింగ్’ వ్యూహాలను అమలు చేయాలని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *