భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఇంతకు ముందున్నంత పోటీతత్వం లేకున్నా రెండు జట్ల మధ్య ఆటపరంగా భేదం పెరుగుతున్నా.. అభిమానులకు ఈ పోరుపై ఆసక్తి మాత్రం ఏమాత్రం తగ్గడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. గత ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా దాయాదుల మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ వ్యూస్ పరంగా మునుపటి రికార్డులన్నింటినీ తిరగరాసింది. అధికారిక డిజిటల్, ప్రసార భాగస్వామి జియోహాట్ స్టార్ వివరాల ప్రకారం భారత్, టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒక మ్యాచ్ ను ఈస్థాయిలో వీక్షించడం ఇదే మొదటిసారి. భారత్, సౌతాఫ్రికా మధ్య 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కంటే కూడా భారత్-పాక్ మ్యాచ్ కే ఎక్కువ వ్యూస్ రావడం విశేషం. 2024లో అమెరికా వేదికగా జరిగిన భారత్, పాక్ మ్యాచ్ తో పోల్చుకుంటే కొలంబో మ్యాచ్ లో డిజిటల్ వ్యూస్ 56 శాతం వృద్ధిని కనబరిచాయి. ఈ ఉత్కంఠభరిత పోరులో భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్థాన్‌పై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 175 పరుగులు చేయగా, పాకిస్థాన్ 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఇషాన్ కిషన్ 77 పరుగులతో (40 బంతుల్లో) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.