ప్రభాస్… మన డార్లింగ్… ఒక వైపు అయన నెక్స్ట్ సినిమాల రుమౌర్స్ వైరల్ అవుతుంటే… ఇంకో వైపు ప్రభాస్ పార్టిసిపేట్ చేసిన కపుల్ ఫ్రెండ్లీ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది… అందులో ప్రభాస్ చెప్పిన విషయాలు ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తనతో ఉన్నవారికి మంచి ఫుడ్ పెట్టడం ప్రభాస్ బాగా ఇష్టపడతాడు. అతిథి సత్కారం విషయంలో ఆయనకు ప్రత్యేక పేరు ఉంది. అలాంటి ప్రభాస్‌కి కూడా పునుగులు అంటే చాలా ఇష్టం అన్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది.‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ప్రభాస్ ఒక సరదా చిట్‌చాట్ వీడియోలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన వంటకం ఉంటుందని, అలానే విజయవాడకు పునుగులు ఎంతో ప్రసిద్ధి అని చెప్పారు. చిన్నప్పటి నుంచి విజయవాడలో తిన్న పునుగుల రుచి ఇప్పటికీ మరిచిపోలేనని ప్రభాస్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. తన సన్నిహిత మిత్రుడు, యువి క్రియేషన్స్ అధినేత ప్రమోద్‌తో కలిసి చిన్ననాట పునుగులు తినడానికి వెళ్లేవాడినని ఆయన గుర్తుచేసుకున్నారు. ప్రమోద్ తండ్రి సాయంత్రం వేళల్లో తన వెస్పా స్కూటర్‌పై వారిద్దరినీ కూర్చోబెట్టి తీసుకెళ్లి పునుగులు తినిపించేవారని చెప్పారు. విజయవాడలో చేసే పునుగులు చిన్నగా, క్రిస్పీగా ఉంటాయని, ప్లేట్‌లో వేసి వాటిపై చట్నీ పోసి ఇస్తారని, ఆ రుచి వేరే లెవల్‌లో ఉంటుందని వివరించారు. ఇలా చెప్పుకుంటూ ఇప్పుడు తనకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయని, వెంటనే పునుగులు తినాలనిపిస్తోందని సరదాగా చెప్పారు.
హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ, ఎప్పుడైనా షూటింగ్ కోసం కారులో వెళ్తూ విజయవాడ దాటేటప్పుడు అక్కడ ఆగి పునుగులు తినాలని అనిపిస్తుందని ప్రభాస్ చెప్పాడు. ఈ ఇంటర్వ్యూలో మరో ముఖ్యమైన అంశం దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు. సంతోష్ శోభన్ మాట్లాడుతూ ప్రభాస్ నటించిన సినిమాల్లో తనకు ‘ఏక్ నిరంజన్’ చాలా ఇష్టమని చెప్పాడు. అక్కడి నుంచి ప్రారంభమైన సంభాషణలో ప్రభాస్ పూరి జగన్నాథ్ స్టైల్‌ను ఎంతో ప్రశంసించాడు. “పూరి గారిలా హీరో క్యారెక్టర్ రాయగల దర్శకుడు ఇండియాలో లేడు. నా కెరీర్‌లో బెస్ట్ క్యారెక్టర్ ‘బుజ్జిగాడు’. ఆ పాత్ర మొదట వినగానే ఎలా చేస్తానో అనిపించింది. కానీ ఆ క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ‘ఏక్ నిరంజన్’ కూడా అలాంటి ప్రత్యేకమైన పాత్రే” అని ఆయన స్పష్టంగా చెప్పారు.