హనుమాన్’ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ వర్మకు దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కి భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు, భారతీయ పురాణాలను కొత్త తరహాలో చూపించవచ్చని నిరూపించింది. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, కథ, ఎమోషన్స్, యాక్షన్… ఇలా ప్రతి అంశంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘హనుమాన్’తో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు అదే యూనివర్స్ నుంచి వస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘మహాకాళి’. ఈ సినిమా గురించి విడుదలవుతున్న ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తోంది. ఈ సినిమా భారతీయ పురాణాల నేపథ్యంలో తెరకెక్కుతోందనే విషయం తెలిసిందే. అందుకే ఇందులో కనిపించే ప్రతి పాత్రపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ పురాణ పాత్రలను కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేస్తారనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఒక కీలక ప్రకటన చేశారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ఈ సినిమాలో అసురుల గురువైన శుక్రాచార్యుడు పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ పోస్టర్ రిలీజ్ ఐన వెంటనే సోషల్ మీడియాలో మంచి బజ్ కనిపించింది. ఎందుకంటే శుక్రాచార్యుడు అనేది భారతీయ పురాణాల్లో అత్యంత కీలకమైన పాత్ర. అసురులకు గురువుగా మాత్రమే కాకుండా, అపారమైన జ్ఞానం కలిగిన మహర్షిగా కూడా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది.
అక్షయ్ ఖన్నా ఎంపిక కూడా చాలామందిని ఆకట్టుకుంది. కెరీర్ ప్రారంభంలో హీరోగా ఎన్నో సినిమాలు చేసిన ఆయన, గత కొన్నేళ్లుగా మాత్రం పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఆగస్టు 24న ‘మహాకాళి’ నుంచి కీలక అప్డేట్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియాలో విడుదల చేసిన పోస్టర్లో “24th August – The End Begins” అనే ట్యాగ్‌లైన్‌ను ఉపయోగించారు. ఆర్కేడీ స్టూడియోస్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఈ పోస్టర్‌ను విడుదల చేయగా, దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా అదే పోస్టర్‌ను షేర్ చేస్తూ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచారు. దీంతో ఆగస్టు 24 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నాతో పాటు భూమి శెట్టి, రోహిత్ సరాఫ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాంకేతికంగా కూడా ‘మహాకాళి’ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ‘హనుమాన్’లో విజువల్ ఎఫెక్ట్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. తక్కువ బడ్జెట్లోనే ఆ స్థాయి అవుట్‌పుట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ ఈ సినిమాను ఏ స్థాయిలో తెరకెక్కించాడో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది.