భారతదేశంలో జరిగిన ఎన్నో ఉగ్రదాడులకు మాస్టర్ మైండ్ అయిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఎక్కడున్నాడు? వేలాది మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకున్న ఆ కరుడుగట్టిన ఉగ్రవాది ఏ దేశంలో దాక్కున్నాడు? ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో, గ్లోబల్ ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఇదే పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఆ ఉగ్రవాది మరెవరో కాదు..జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ . భారతదేశంపై విషం చిమ్మే కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజార్. 2001లో భారత పార్లమెంట్ పై జరిగిన దాడి , 2008లో ముంబై దాడులు, 2016లో పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై ఉగ్రదాడి, 2019లో యావత్ దేశాన్ని కన్నీట ముంచిన పుల్వామా ఉగ్రదాడి .. ఈ దారుణాలన్నింటికీ ప్రధాన సూత్రధారి ఈ మసూద్ అజారే. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి, వారిని భారత్ పైకి ఉసిగొల్పడం ఇతని ప్రధాన వృత్తి. ఇతని ఆగడాలను గుర్తించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2019లో మసూద్ అజార్‌ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది. అతన్ని పట్టివ్వాలని, అరెస్ట్ చేయాలని పాకిస్తాన్‌పై ప్రపంచ దేశాలు తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. కానీ పాకిస్తాన్ మాత్రం అతన్ని ఒక వీఐపీలాగా చూసుకుంటూ, బహవల్పూర్ లోని జైషే మహమ్మద్ హెడ్‌క్వార్టర్స్‌లో అతనికి పూర్తి ఆర్మీ భద్రతను కల్పించింది. ప్రపంచ దేశాలు ఎంత మొత్తుకున్నా మసూద్ అజార్‌ను అరెస్ట్ చేయని పాకిస్తాన్‌కు, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఒక గట్టి షాక్ ఇచ్చింది. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం, ఆశ్రయం కల్పిస్తున్నందుకు గాను పాకిస్తాన్‌ను 2018లో FATF గ్రే లిస్ట్ లో పెట్టింది. దీంతో పాకిస్తాన్‌కు అంతర్జాతీయ సంస్థల నుంచి, యూరప్ దేశాల నుంచి వచ్చే ఆర్థిక సాయం నిలిచిపోయింది. అప్పటికే అప్పుల ఊబిలో ఉన్న పాక్, ఈ గ్రే లిస్ట్ నుంచి బయటపడటానికి ఒక నాటకానికి తెరతీసింది. జైషే మహమ్మద్ లాంటి సంస్థలపై నిషేధం విధించినట్లు కలరింగ్ ఇచ్చింది. మసూద్ అజార్‌ను అరెస్ట్ చేస్తామని FATF కు హామీ ఇచ్చింది. కాఅయితే 2019 మే నెలలో మసూద్ అజార్ తమ దేశం నుంచి పారిపోయాడని, డ్యూరాండ్ లైన్ దాటి ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రవేశించాడని ఒక కొత్త స్టోరీతో అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది.
అయితే ఈ నాటకంపై ఆఫ్ఘనిస్తాన్ తీవ్రస్థాయిలో మండిపడింది. 2022లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత కూడా మసూద్ అజార్ వ్యవహారంపై పాకిస్తాన్ ఈ ఆరోపణలు చేస్తూనే ఉంది. తాజాగా పాక్ ఆరోపణలపై ఆఫ్ఘన్ విదేశాంగ శాఖ సీనియర్ అధికారి మాట్లాడుతూ పాకిస్తాన్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. మసూద్ అజార్ అసలు ఆఫ్ఘనిస్తాన్‌లో లేడని పాకిస్తాన్ చెప్పేవన్నీ అసత్యాలే అని టెర్రరిస్టులను పెంచి పోషించే చరిత్ర పాకిస్తాన్‌దే తప్ప తమది కాదని దుయ్యబట్టారు. ఇతర దేశాలపై దాడులు చేయడానికి, కుట్రలు పన్నడానికి ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని ఎవరికీ వినియోగించుకోనివ్వం అని తాలిబన్ ప్రభుత్వం నిక్కచ్చిగా చెప్పేసింది. దీంతో అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ పరువు పూర్తిగా గంగలో కలిసింది. ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒకటే.. అసలు మసూద్ అజార్ ఎక్కడ అనేది? పాక్ దొంగనాటకాలని భారత ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం, గ్లోబల్ నిఘా సంస్థల రిపోర్టుల ప్రకారం మసూద్ అజార్ ఇప్పటికీ పాకిస్తాన్ లోనే ఉన్నాడనే తెలుస్తోంది. పాక్ ఆర్మీ పూర్తి రక్షణ నడుమ ఒక సీక్రెట్ సేఫ్ హౌస్‌లో అతను తలదాచుకున్నాడని బలంగా నమ్ముతున్నారు. మరోవైపు FATF సమావేశాలు త్వరలో జరగబోతున్నాయి. ఉగ్రవాదులను కట్టడి చేయడంలో పాకిస్తాన్ ఇచ్చిన హామీలను ఏ మేరకు నిలబెట్టుకుందో ఈ సమావేశంలో రివ్యూ చేయబోతున్నారు. ఒకవేళ మసూద్ అజార్ తమ దగ్గరే ఉన్నాడని పాకిస్తాన్ ఒప్పుకుంటే, మళ్లీ గ్రే లిస్ట్ లేదా బ్లాక్ లిస్ట్‌లో పడటం ఖాయం. అందుకే, పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగానే ఆఫ్ఘనిస్తాన్పై బురద జల్లుతూ తన డబుల్ గేమ్‌ను కంటిన్యూ చేస్తోందని దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు ఆఫ్ఘనిస్తాన్‌తో, ఇటు ఇండియాతో శత్రుత్వం పెంచుకుంటున్న పాకిస్తాన్‌కు రాబోయే రోజుల్లో గట్టి మూల్యం చెల్లించుకోక తప్పదనే అభిప్రాయం జియో పొలిటికల్ ఎనలిస్టుల నుండి వ్యక్తమవుతోంది.