వాతావరణ మార్పులతో భూమి మీద వాటర్ సైకిల్ తీవ్రంగా ప్రభావితమవుతుందన్న నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. భూ తాపం (గ్లోబల్ వార్మింగ్) కారణంగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల నీటి ఆవిరి కావడం, వర్షాలు పడటం వంటి సహజ ప్రక్రియలలో భారీ మార్పులు వస్తున్నాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) కూడా దీనిపై హెచ్చరించింది.
గ్లేసియర్లు కరిగిపోవడం, భూగర్భ జలాలు తగ్గిపోతుండడం ఒక చోట కరువు పరిస్థితులు, మరొక చోట భారీ వరదలు సంభవిస్తుండడం ఇలా అసమతుల్యంగా ఉండడం ఎల్ నినో వంటి పరిస్థితులతో ప్రజలు తీవ్ర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. భవిష్యత్తులో ప్రజల జీవనోపాధి, ఆరోగ్యం, ఆహార భద్రత, ఆర్థిక వ్యవస్థలపై ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎటువంటి పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకోవడం వలన సాధారణ పరిస్థితిని భూమి మీద పునః సృష్టించవచ్చో చూద్దాం. వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, అటవీ ఆధారిత వృత్తులపై ఆధారపడిన కోట్ల మంది ప్రజలు తమ జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉంది. సముద్ర మట్టాలు పెరగడం వల్ల తీరప్రాంత ప్రజలు తమ ఆవాసాలను వదిలి వలస వెళ్లాల్సి వస్తుంది. పర్యావరణ విపత్తుల వల్ల సంప్రదాయ వృత్తులు దెబ్బతిని, కొత్త తరహా పర్యావరణ వలసదారులు రూపాంతరం చెందే అవకాశం ఉంది.ఇక వర్షపాతంలో తీవ్ర వ్యత్యాసాలు చోటుచేసుకుని సకాలంలో వర్షాలు పడకపోవడం వల్ల పంటల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. కరువులు భూమి సారాన్ని దెబ్బతీస్తే, ఆకస్మిక వరదలు చేతికి వచ్చిన పంటలను తుడిచిపెట్టేస్తాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడం నీటిపారుదలకు అడ్డంకిగా మారి, భవిష్యత్తులో తీవ్రమైన ఆహార సంక్షోభానికి దారితీసే అవకాశం ఉంది.
వాతావరణంలో సంభవించే మార్పులు కొత్త రోగాలకు, అంటువ్యాధులకు కారణమవుతాయి. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల హీట్స్ట్రోక్స్, గుండె సంబంధిత సమస్యలు పెరుగుతాయి. వరదల వల్ల తాగునీరు కలుషితమై కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధులు, దోమల విస్తరణ వల్ల మలేరియా, డెంగ్యూ వంటి కిటకజనిత రోగాలు తీవ్ర రూపం దాలుస్తాయి. శుభ్రమైన తాగునీరు దొరక్కపోవడం పోషకాహార లోపానికి దారితీస్తుంది. పర్యావరణ విపత్తులు దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర భారాన్ని మోపుతాయి. వరదలు, తుఫానుల వల్ల మౌలిక వసతులు ధ్వంసమయ్యే అవకాశం ఉండనుంది. గ్లేసియర్లు కరిగిపోవడం వల్ల ఆరంభంలో వరదలు వచ్చినప్పటికీ, కాలక్రమేణా జీవనదులు ఎండిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు భూగర్భ జలాలు తోడేయడం వల్ల మంచినీటి లభ్యత దారుణంగా పడిపోతుంది. వాతావరణ మార్పుల వల్ల అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యేది పేదలు మరియు దిగువ మధ్యతరగతి ప్రజలే. ధనిక వర్గాలు సాంకేతికత, ఆర్థిక వనరుల సహాయంతో ఈ మార్పులను తట్టుకోగలిగినప్పటికీ, పేద ప్రజలకు రక్షణ కరువై పేదరికం మరింత విస్తరిస్తుంది. ఇది సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలను మరింత తీవ్రతరం చేస్తుంది.
ఇలా ఇటువంటి వాటిని నిరోధించాలంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవడమే మార్గం. వనరులను దుర్వినియోగం చేయకుండా సక్రమంగా వినియోగించుకోవాలి. బొగ్గు, పెట్రోలియం వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని తక్షణమే తగ్గించాలి. సౌర, పవన విద్యుత్, జలవిద్యుత్ వంటి హరిత ఇంధనాల వాడకాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలి. దీనివల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి, భూగోళం వేడెక్కడం క్రమంగా అదుపులోకి వస్తుంది. చెట్లు వాతావరణంలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకుని ఆక్సిజన్ ను విడుదల చేస్తాయని తెలిసిందే. నరికివేసిన అడవులను పునరుద్ధరించడం, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ సాంద్రతలో చెట్లు ఉండే విధంగా ‘మియావాకీ’ పద్ధతిలో అడవులను పెంచడం ద్వారా భూ ఉష్ణోగ్రతలను తగ్గించవచ్చు. అడవులు వర్షపాతాన్ని పెంచడానికి మరియు నేలకోతను నివారించడానికి ఎంతో దోహదం చేస్తాయి. భూగర్భ జలాలు అడుగంటకుండా వర్షపు నీటిని ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్ల ద్వారా భూమిలోకి ఇంకేలా చూడాలి. మనకు అనాదిగా వస్తున్న సాంప్రదాయ నీటి వనరులైన చెరువులు, బావులను పూడికతీసి బాగుచేసుకోవాలి. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం వల్ల కరువు పరిస్థితులతో పోరాడడం తేలికవుతుంది. రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ వ్యవసాయానికి క్రమంగా అలవాటు పడాలి. ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా తక్కువ నీటితో పండే చిరుధాన్యాలు, ఆరుతడి పంటలను సాగు చేయాలి. బిందు, తుంపర సేద్యం (Drip and Sprinkler Irrigation) ద్వారా నీటి వృధాను అరికట్టవచ్చు.
పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే పొగను నియంత్రించేందుకు కఠినమైన నిబంధనలు అమలు చేయాలి. పరిశ్రమలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కార్బన్ క్యాప్చర్ (Carbon Capture) టెక్నాలిజీని వాడేలా ప్రోత్సహించాలి. విద్యుత్ వాహనాల (EVs) వినియోగాన్ని పెంచడం ద్వారా రవాణా రంగాన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా మార్చవచ్చు.ప్లాస్టిక్ వాడకాన్ని సంపూర్ణంగా అరికట్టడం మరియు వ్యర్థాలను రీసైకిల్ చేయడం చాలా ముఖ్యం. ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాలు, నదులలో కలవడం వల్ల జలచరాలు నశించడమే కాకుండా, భూమి ఇంకే సామర్థ్యం దెబ్బతింటుంది. ‘Reduce, Reuse, Recycle సూత్రాన్ని ప్రతీ ఒక్కరూ పాటించాలి. భవిష్యత్తులో వచ్చే వరదలు, తుఫానులను తట్టుకునే విధంగా నగరాలు, భవనాలు, రోడ్ల నిర్మాణం జరగాలి. పట్టణాల్లో కాంక్రీట్ అడవులను తగ్గించి, నీరు ఇంకేలా పచ్చిక బయళ్ళు, పార్కులను విస్తరించాలి. తీరప్రాంతాల్లో మడ అడవులను పరిరక్షించుకోవడం ద్వారా తుఫానుల ధాటి నుండి తీర ప్రాంతాలను కాపాడుకోవచ్చు.పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి తమ బాధ్యతను నెరవేర్చేలా కృషి చేయాలి. పాప్రపంచ దేశాలన్నీ పారిస్ ఒప్పందం వంటి అంతర్జాతీయ పర్యావరణ సంధులపై నిబద్ధతతో పనిచేస్తూ, సాంకేతికత మరియు నిధులను పరస్పరం పంచుకోవడం ద్వారా మాత్రమే మన భూగోళాన్ని పూర్వ వైభవానికి తీసుకురాగలము.