వరంగల్ ఎయిర్ పోర్ట్..కాంగ్రెస్ పాలనలో ఆ కల సాకారమవుతోంది:సీఎం రేవంత్ 

Spread the love

వరంగల్‌ లో ప్రపంచ స్థాయి విమానాశ్రయం కల సాకారమవుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. బిఆర్ఎస్10 ఏళ్లపాటు అధికారంలో ఉండి కూడా వరంగల్ విమానాశ్రయానికి సంబంధించిన సుదీర్ఘ కల నెరవేర్చడంలో విఫలమైందని వారి నాయకులు కుటుంబ ప్రయోజనాలు, విలాసవంతమైన ఫామ్‌హౌస్‌లపైనే దృష్టి సారించారని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన లో ఈ కల ఎట్టకేలకు సాకారమవుతోందని మామునూరు విమానాశ్రయం భూసేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.295 కోట్లు కేటాయించింది. దానికి కావలసిన భూమిని పూర్తిగా సేకరించి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కి అప్పగించారని తెలిపారు. ఈ స్వప్నం కార్యరూపం లోకి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం విమానాశ్రయం మాత్రమే కాదు. ఇది పరిశ్రమలు, పర్యాటకం, విద్య, ఉద్యోగాలు మరియు పెట్టుబడులకు ఒక కొత్త ద్వారమని రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ వృద్ధికి, అనుసంధానతకు సరికొత్త ప్రతీకగా నిలిచే వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయం నుండి ప్రయాణించడానికి వేచి చూస్తున్నాం. వరంగల్ కొత్త విమానాశ్రయానికి మనం ఏ పేరు పెడితే బాగుంటుంది..? తగిన సూచనలు చేయాలని రేవంత్ సోషల్ మీడియా వేదికగా ప్రజలను కోరారు. వరంగల్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విమానాశ్రయం (మామునూరు ఎయిర్‌పోర్ట్) అందుబాటులోకి రావడం ఉత్తర తెలంగాణ రవాణా వ్యవస్థలో ఒక చారిత్రాత్మక మలుపుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది అందుబాటులోకి వస్తే  హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంపై ఆధారపడడాన్ని  తగ్గించడమే కాకుండా, వరంగల్‌ తో పాటు కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ వంటి సమీప జిల్లాల ప్రజలకు ఇది సుదూర ప్రాంతాల ప్రయాణాలను మరింత తేలిక చేయనుందని చెబుతున్నారు. ఎమర్జెన్సీ వైద్య సేవలు, ఉద్యోగ, వ్యాపార రీత్యా ఇతర రాష్ట్రాలకు మరియు విదేశాలకు వెళ్లేవారికి ఈ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం కూడా ఆదా అవుతోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ప్రయాణికుల సేవలకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు మరింత బలాన్ని చేరకూర్చనుందనే అభిప్రాయం కొందరు ఆర్థిక విశ్లేషకుల నుండి వస్తోంది.  విమానాశ్రయ నిర్మాణంతో పాటు దాని నిర్వహణ, లాజిస్టిక్స్, ట్రాన్స్ పోర్ట్, హోటళ్ళు మరియు రిటైల్ రంగాలలో వేలాదిగా ప్రత్యక్షంగా, పరోక్షంగాను ఉపాధి లభించనుంది. రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో వరంగల్ చుట్టుపక్కల భూముల విలువలు పెరిగి, మౌలిక వసతుల కల్పన కూడా జోరందుకుంటుంది. తెలంగాణా అభివృద్ధితో పాటు పారిశ్రామికంగా కూడా వరంగల్ రూపురేఖలు మారనున్నాయి. వరంగల్ చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన నగరం కావడంతో పర్యాటక  రంగానికి సరికొత్త ఉత్సాహాన్ని ఇవ్వనుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *