ఇదేంటి..పవన్ కేంటీ..? వైసీపీలో ఫాలోయింగ్ పెరగడమేంటనుకుంటున్నారా..? అవును మీరు చూస్తోంది నిజమే..గడచిన 20 రోజుల్లో పవన్ రాష్ట్ర ప్రజల మనసుల్నే కాదు…వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ లో సైతం మంచి మార్కులు కొట్టేశారు. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి హుందాగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్, గతంలో ఉన్న ఆవేశం కనిపించటం లేదు…పెద్ద హోదాలో ఉన్నానన్న గర్వం కనబడటం లేదు..అధికారంలో ఉన్నాం కదా అని అహంకారం ఏమాత్రం ప్రదర్శించటం లేదు..తను చేపట్టిన శాఖలపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. కీలకమైన పంచాయితీరాజ్, గ్రామీణ నీటిపారుదల, అటవీ, పర్యావరణం వంటి శాఖలను చేపట్టిన ఆయన ప్రతిరోజూ వరుస రివ్యూలు చేసుకుంటూ పాలనాపరంగా గ్రిప్ తెచ్చుకునేందుకు యత్నిస్తున్నారు. కృష్ణతేజ లాంటి సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్లను డిప్యూటేషన్ పై రప్పించుకుని ఇకపై తన పంథా ఎలా ఉండబోతోందో ఆయన శాంపిల్ గా సంకేతాలను పంపారు. అంతేకాదు..తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధికి మోడల్ గా మలిచేందుకు తనదైన ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు. ఇంకోవైపు తన ఫ్యాన్స్ చేసే హంగామాను మనసులో పెట్టుకున్న పవన్,,,సందర్భం వచ్చిన ప్రతిసారీ వారిని మంచి ట్రాక్ లోకి తీసుకువచ్చి సమాజానికి ఉపయోగపడేలా సైలెంట్ కౌన్సిలింగ్ సైతం ఇస్తున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని బైకుల వెనుక వేసుకోకండి..మనం చట్టాలు చేసే హోదాలో ఉన్నాం..మనమే ఇలా చేస్తే పోలీసులు, ఆర్టీఏ అధికారులు తిట్టుకుంటారని సున్నితంగా పవన్ పంపిన హెచ్చరికలు కుర్రకారులో ఆలోచనల్ని రేకెత్తించేలా చేశాయి.. అంతేకాదు..మీరు రేసింగ్ లు చేయాలనుకుంటే నేను కొన్న 3 ఎకరాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ హ్యాపీ గా చేసుకోండని చెప్పటం చూస్తోంటే ఫ్యాన్స్ ను మందలించటమే కాదు..వారిని అక్కున చేర్చుకోవటం కూడా నాకు తెలుసు అన్నట్లు పవన్ వ్యవహరించిన తీరు పిఠాపురం వాసుల్ని ఆకట్టుకుంది. పోలీసు అధికారులకు పవన్ పై గౌరవం పెరిగేలా చేసింది.
అదేవిధంగా అటు మిత్రపక్షాలతో టచ్ లో ఉంటూ కూటమి లో ఎలాంటి డిస్టర్బెన్స్ లు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో శనివారం రాత్రి సుదీర్ఘమంతనాలు జరిపి జనసేన, టిడిపి మధ్య ఉండాల్సిన సమన్వయంపై దిశానిర్దేశం చేయటం చూస్తోంటే రాజకీయంగా పవన్ ఆలోచనలు నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయన్నది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అంతాబానే ఉన్నప్పటికీ..ఈగోలతో కూటమిలో గోలలు రావద్దన్నది పవన్ ఆలోచన. అలాగే వైసీపీలో గతంలో తనను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలని చూసిన కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి లాంటి వారికి సైతం సంబంధిత చట్టాల ద్వారానే తగు సమాధానాలిస్తున్నారు. అంటే అటు రాజకీయంగా జనసేనను బలోపేతం చేసుకోవటం, ఇటు పాలనాపరంగా అనుభవాన్ని సంపాదించుకోవటం...వ్యక్తిగతంగా తన జోలికి వచ్చిన వారికి రిటర్న్ గిఫ్టులెలా ఉంటాయో శాంపిల్ చూపటం లాంటి చర్యలన్నీ ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. రాష్ట్రానికి కొత్త రాజకీయాన్ని పవన్ పరిచయం చేస్తున్నారన్న చర్చ ఏ ఇద్దరు కలిసినా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు.
ఇదే సమయంలో అటు వైసీపీలో సైతం పవన్ గురించిన చర్చే ఎక్కువగా జరుగుతోందట. తమ ఓటమికి ప్రధాన కారణం జనసేనాని అని గట్టిగా నమ్ముతున్న ఆపార్టీ నేతలు, క్యాడర్...పవన్ పై కోపం కంటే ఆత్మ విమర్శ చేసుకునే పనిలో పడ్డారట. తమకు అధికారం ఉన్నపుడు ఏరోజూ శాఖలపై సమీక్షలు కానీ, ప్రజలకు సంబంధించిన నిర్ణయాలు కానీ తీసుకోకుండా కేవలం క్యాంప్ ఆఫీసులకే పరిమితమై...బటన్ నొక్కడాలకే ప్రాధాన్యతనిచ్చామనీ, దాని ఫలితం ఇఫ్పుడు అనుభవిస్తున్నామని ఆవేదన చెందుతున్నారట. టిడిపి నేతలు, ఆ పార్టీ క్యాడర్ తమ ఆఫీసులపైనా, కొన్ని చోట్ల తమ కార్యకర్తలపైనా దాడులకు పాల్పడటం చూస్తోంటే..పవన్ కళ్యాణ్ గురించే వారు ప్రస్తావించుకున్నారట. తమను ఓడించినా అతని హుందాతనం ఆరాధించేలా చేస్తోందని వారు అభిప్రాయపడుతున్నారట. అధికారంలో ఉన్నపుడు ఇలా మిగతావన్నీ వదిలేసి కేవలం పవన్ బూతులు తిట్టడానికి, ఆయన పెళ్లిళ్ల గురించి మాత్రమే టైమ్ మొత్తం కేటాయించామనీ, ఆ బూతుల నుండే నీతివంతమైన పాలన అందించే శక్తివంతమైన రాజకీయానికి పవన్ శ్రీకారం చుట్టారని ఇంటర్నల్ గా వారు చర్చించుకుంటున్నారట. ఇక ఇలాంటి చెత్త స్ట్రాటజీలను పక్కనబెట్టి ఇప్పటికైనా బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ప్రజల్లో పేరు తెచ్చుకుంటూ...క్యాడర్ కు సైతం భరోసా ఇచ్చేలా పార్టీ పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తే భవిష్యత్తులో మళ్లీ మంచి రోజులు వచ్చే అవకాశముందని వారు అభిప్రాయపడుతున్నారట.
మొత్తంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన ఫ్యాన్స్ శాటిస్ ఫై అయ్యేలా మాత్రమే కాదు…ప్రత్యర్ధి క్యాడర్ ను సైతం తన ఫ్యాన్స్ లా మార్చుకునేంతగా అడుగులు వేస్తున్నారంటే రాజకీయాల గురించి తెలిసిన ఎవరైనా శభాష్ పవన్ అనాల్సిందేమరి.