బెజవాడ వరదను దగ్గరుండి ఆపిన మంత్రి నిమ్మల..

విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరద నగర వాసులనే కాదు మొదట్లో ప్రభుత్వాన్ని సైతం ఆందోళనలోకి నెట్టేసింది. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్ లోకి వెళ్లిపోయింది. సహాయక చర్యలు సైతం ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలియని పరిస్దితి. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు మాత్రం బుడమేరు వరదకు ఎలా అడ్డుకట్ట వేయాలన్న దానిపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. దాని ఫలితమే బుడమేరు గండ్ల పూడిక. వారం రోజులుగా రాత్రీపగలూ తేడాలేకుండా, భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నిమ్మల పడిన శ్రమ బెజవాడను గట్టెక్కించింది.

విజయవాడ వరదలను ముందుగానే పసిగట్టలేకపోయారనే విమర్శల మధ్య బుడమేరుకు పడిన మూడు గండ్లకు అడ్డుకట్ట వేసే పనిని ప్రారంభించారు జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు. ఓవైపు ప్రభుత్వం నగరంలో శ్రమిస్తుంటే.. మరోవైపు తాను తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లాలోకి వస్తున్న బుడమేరు వరద ప్రవాహానికి అడ్డుకట్ట ఎలా వేయాలో ప్రణాళికలు సిద్దం చేశారు. స్ధానిక అధికారులు, సిబ్బంది ఎంత శ్రమించినా గండ్ల పూడిక తక్కువ సమయంలో పూర్తి చేయడం కష్టం. అందుకే ఆర్మీ సాయం తీసుకోవాలని నిర్ణయించారు. వెంటనే సీఎం చంద్రబాబుకు చెప్పి ఆర్మీని రప్పించగలిగారు.

బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగినా క్షేత్రస్దాయిలో తాను లేకపోతే అధికారులు సహకరిస్తారో లేదో అన్న భయం మధ్య మంత్రి రామానాయుడు అక్కడే ఉండిపోయారు. రాత్రీ, పగలూ తెలియకుండా బుడమేరు గట్టుపై ఉండి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సీఎం చంద్రబాబుకూ, మంత్రి నారా లోకేష్ కు అప్ డేట్స్ ఇచ్చారు. అలా ఒక్కో రోజూ గడుస్తుంటే ఒక్కో గండీ పూడ్చుకుంటూ వచ్చారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అలా ఏకంగా 62 గంటల పాటు బుడమేరు గట్టుపైనే పాగా వేసి బెజవాడలోకి నీరు వెళ్లకుండా అడ్డుకట్ట వేయించారు.

ఆర్మీ సాయంతో మంత్రి నిమ్మల రామానాయుడు పడిన శ్రమ ఫలించి శనివారం విజయవంతంగా బుడమేరుకు పడిన మూడో గండినీ పూడ్చేశారు. గాబియన్ బాస్కెట్ విధానంలో ఆర్మీ సిబ్బంది గండ్లను పూడుస్తుంటే మరోవైపు సిబ్బంది, అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ వారికి అవసరమైన సాయం అందించడంలో మంత్రి రామానాయుడు కీలక పాత్ర పోషించారు. దీంతో ఇవాళ మూడో గండి పూడ్చేశారని తెలియగానే మంత్రి నారా లోకేష్ స్వయంగా వచ్చి శభాష్ రామానాయుడు అంటూ ఆయన్ను అభినందించారు. అలా విజయవాడ వరదకు అడ్డుకట్ట వేసిన మంత్రిగా రామానాయుడుకు క్రెడిట్ దక్కింది.