ఆవిష్కరణల విషయంలో కంపెనీలకు సహకారం అందిస్తామని, సౌర, పవన హైబ్రిడ్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు ఇస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గుజరాత్లోని గాంధీనగర్లో 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై భేటీలో పాల్గొని ప్రసంగించారు. విద్యుత్ రంగంలో గణనీయమైన సంస్కరణలు వచ్చాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నామన్న చంద్రబాబు, వీటి ద్వారా ఏపీకి పలు ప్రాజెక్టులు సాధించామని గుర్తు చేశారు. క్లీన్ ఎనర్జీ నాలెడ్జ్, నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉందని, గ్లీన్ ఎనర్జీ సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సి ఉందని తెలిపారు. ఏపీలో విన్-విన్ విధానంలో భూసమీకరణ జరుగుతుందన్న సీఎం చంద్రబాబు, భూసమీకరణ సమయంలో మానవతా కోణంలో ఆలోచిస్తామన్నారు. భూసమీకరణకు ఒప్పించి సానుకూల వాతావరణం ఉండేలా చూస్తామని, కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. సంస్థలకు అవసరమైన అనుమతుల ఏర్పాటుకు కృషిచేస్తామన్న సీఎం, సౌర, పవన హైబ్రిడ్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. సహేతుకమైన ధరలకు భూమి లీజుకు ఇస్తామని తెలిపారు.