మెగా9 వెబ్ డెస్క్ : గమ్యం, వేదం, కంచె, కొండపొలం లాంటి విభిన్న సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఇప్పుడు మరోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ ప్రీతి చెల్లా అనే అమ్మాయిని క్రిష్ నిశ్చితార్థం చేసుకోబోతున్నారంట అంతే కాదండోయ్ ఈ నెలలోనే వీరి వివాహం కూడా జరగబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది.
గమ్యం సినిమాతో అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకున్నాడు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి. ఇక అల్లు అర్జున్, మంచు మనోజ్ లతో కలిసి మల్టీ స్టారర్ మూవీ వేదంతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. వీటి తర్వాత కృష్ణం వందే జగద్గురుమ్, కంచె, గౌతమీ పుత్ర శాతకర్ణి తదితర సినిమాలతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గబ్బర్ ఈజ్ బ్యాక్ (ఠాగూర్ రీమేక్) తో బాలీవుడ్ లోనూ సత్తా చాటాడు క్రిష్. నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహా నాయకుడు సినిమాలకు సైతం క్రిష్ దర్శకత్వం వహించి తన దర్శక ప్రతిభని చాటారు. ఇక మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి క్రిష్ తెరకెక్కించిన కొండ పొలం సినిమాకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి కానీ కాసులు రాలేదు. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి హరి హర వీర మల్లు సినిమాను కూడా ప్రారంభించాడు. అయితే కొన్ని కారణాలతో ఈ ప్రాజెక్టు నుంచి కూడా మధ్యలోనే తప్పుకున్నాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. ప్రస్తుతం అనుష్కా శెట్టితో కలిసి ఘాటీ అనే ఓ లేడీ ఓరియంటెడ్ మూవీని క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్ ఘాటీపై అంచనాలను రెట్టింపు చేసింది.
సినిమాల సంగతి పక్కన పెడితే.. క్రిష్ వ్యక్తిగత జీవితం ఒడిదొడుకులతో కొనసాగుతోంది. 2016లో రమ్య అనే వైద్యురాలిని వివాహం చేసుకున్నాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. అయితే ఐదేళ్లకే వీరి వివాహ బంధం బీటలు వారింది. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో 2021లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటి నుంచి క్రిష్ మాత్రం సింగిల్ గానే ఉంటున్నాడు. అయితే ఇప్పడు కొత్త జీవితం ప్రారంభించేందుకు ఈ క్రేజీ డైరెక్టర్ రెడీ అయ్యాడని సమాచారం. హైదరాబాద్ కి చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ప్రీతి తో క్రిష్ వివాహం జరగనుందని సమాచారం. త్వరలోనే వీరి వివాహం జరగనుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఈ క్రమంలోనే క్రిష్ కు కాబోయే భార్యకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే వధువు ఆమెనో కాదో తెలియాలంటే మాత్రం పెళ్లి వరకు ఎదురు చూడాల్సిందే.