ఇది నా అడ్డా,ఇక్కడ నా మాటే శాసనం!

Spread the love

Rajagopal Reddy Munugode Constitution: తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక రూల్..! కానీ అక్కడ మాత్రం మరో రూల్!!.. ఇది నా అడ్డా, ఇక్కడ నా మాటే శాసనం!.నా ప్రజల ఆరోగ్యం కోసం రూల్స్ మారాల్సిందే అంటున్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి.ఆ ఎమ్మెల్యే అక్కడ సొంత రాజ్యాంగం అమలు చేస్తున్నారా?.. మునుగోడులో అమలు చేయాల్సిందే అంటున్న ఆ రూల్స్ ఏంటి?.కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్,మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ విధానం,మద్యం టెండర్లపై ఆయన ప్రకటించిన నయా రూల్స్ ఏమిటి? ఆయన సొంత రూల్ బుక్ తో ప్రభుత్వ ఖజానాకు ఎలా గండి పడబోతోంది.?

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గెలిచినప్పటి నుంచే తన నియోజకవర్గంలో బెల్ట్ షాపుల మీద ఉక్కుపాదం మోపుతూనే ఉన్నారు. తాజాగా, రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల కాల పరిమితితో వైన్స్ టెండర్లకు నోటిఫికేషన్ ఇవ్వగా,ఆయన టెండర్ల ప్రక్రియపై కూడా కన్నేశారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిబంధనలకు బదులుగా, ఆయన మునుగోడుకు ఓన్ రూల్స్ ప్రకటించేశారు. ఆయన ప్రకటించిన మునుగోడు రాజ్యాంగంలోని నయా రూల్స్ ఎక్సయిజ్ శాఖకు తల నొప్పిగా మారినట్టు తెలుస్తుంది. వైన్ షాపులకు స్థానికులు మాత్రమే టెండర్స్ వేయాలి. ఏ మండలం వారైతే, ఆ మండలంలో మాత్రమే టెండర్లు వేయాలని ఖచ్చితంగా ఆదేశించారు.ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు షాప్ ఓపెన్ చేయవచ్చు.కానీ, రాజగోపాల్ రెడ్డి రూల్ ప్రకారం..సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరవాలంటూ టైమింగ్ రూల్ పాస్ చేశారు. వైన్ షాపులకు అనుబంధంగా ఉండే పర్మిట్ రూమ్ లకు పూర్తిగా నో ఛాన్స్ అని స్పష్టం చేశారు.”ఈ రూల్స్ పెట్టడానికి ఆయన చెప్తున్న రీజన్ ఒక్కటే – స్థానికులు టెండర్లు వేస్తే, నిర్వహణ తాను చెప్పినట్లుగా, ప్రజలకు అనుగుణంగా నడుస్తుందనేది రాజగోపాల్ రెడ్డి ప్లాన్.

కేవలం టెండర్ రూల్స్ మాత్రమే కాదు! వైన్ షాపులను ఊరికి దూరంగా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు రాజగోపాల్ రెడ్డి.అంతేకాదు,సిండికేట్ ను సహించేది లేదని, తన రూల్స్ అమలు బాధ్యత క్యాడర్ తీసుకోవాలని చెప్పారాయన. రాజకీయంగా మరింత సంచలనం ఏమిటంటే హస్తం పార్టీ నేతలు ఎవరూ మద్యం టెండర్ల జోలికి వెళ్లొద్దని ఎమ్మెల్యే సూటిగా చెప్పేయడం.సొంత పార్టీ నేతలను సైతం వైన్ టెండర్ల నుంచి దూరం పెట్టడం ఇప్పుడు నియోజకవర్గంలో కలకలం రేపుతోంది. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 26 మద్యం షాపులు ఉన్నాయి.ఒక్కొక్క షాప్ లైసెన్స్ ఫీజు కింద రెండు సంవత్సరాలకు 1 కోటి 10 లక్షలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మొత్తం 28 కోట్లకు పైగా ఆదాయం ఖజానాకు జమ అవుతుంది. అయితే,రాజగోపాల్ రెడ్డి ప్రకటించిన ఈ ‘మునుగోడు రాజ్యాంగం’ ప్రకారం, స్థానికులకు మాత్రమే టెండర్లు పరిమితం అయితే.. నాన్-లోకల్స్ వేసిన దరఖాస్తులు రద్దు అవుతాయి. దీంతో, ప్రభుత్వానికి రావాల్సిన రూ.28 కోట్లతో పాటు, దరఖాస్తు ఫీజు కింద రావాల్సిన దాదాపు 4 కోట్ల అదనపు ఆదాయానికి భారీగా గండి పడుతుందన్న ఆందోళన ఎక్సైజ్ అధికారుల్లో వ్యక్తమవుతోంది.

రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుఖాణాల అప్లికేషన్ ఫీజు 3 లక్షలకు పెంచడంతో దరఖాస్థులు మంద కొడిగా సాగుతున్నాయి.ఈ నెల 18 వరకు చివరి రోజు ఉండడంతో ఒకవైపు రాష్ట్ర ఖజానా నింపేందుకు పడరాని పాట్లు పడుతుంటే, రాజగోపాల్ రెడ్డి తాజా కండిషన్స్ తో పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లు అయిందట ఎక్సైజ్ అధికారుల పరిస్థితి.’నా రూల్స్ నా ఇష్టం’ అని ఎమ్మెల్యే గట్టిగా చెబుతుండటంతో, టెండర్లు దాఖలు చేసిన నాన్-లోకల్స్ తలలు పట్టుకుంటున్నారు. ఎక్సైజ్ అధికారులు కూడా ప్రభుత్వ పెద్దల వైపు ఏం చేయాలంటూ చూస్తున్నట్లు తెలుస్తుంది. Rajagopal Reddy Munugode Constitution.

రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీతో ముందుకు వెళ్తుంటే, అధికార పార్టీ ఎమ్మెల్యే ఆ విధానాన్ని సవాలు చేస్తూ సొంత రూల్స్ పాస్ చేయడం ఎక్కడి దాకా దారి తీస్తుందో చూడాలి.కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న ఈ కొత్త ప్రయోగం పై హైకమాండ్ ఎలా స్పందిస్తుంది? మునుగోడులో ఎక్సైజ్ రూల్స్ అమలవుతాయా? లేక ఎమ్మెల్యే రాజ్యాంగం గెలుస్తుందా?.. వేచి చూడాల్సి ఉంది.