కారు గేరు మార్చిందా?

Spread the love

BRS criticizes CM Revanth: తెలంగాణలో రేవంత్ సర్కారును ప్రతి పక్ష బిఆరెస్ పావులు కదుపుతోందా’?.ఓ వైపు బీసి ఉద్యమం!,మరో వైపు బిఆరెస్ బాఖీ కార్డు ల పంపిణి,ఇంకో వైపు యూరియా కొరత,ధాన్యం కొనుగోళ్ళలో మద్దతు ధర అంశాలు ప్రభుత్వానికి పెను సవాలుగా మారాయా?.సరిగ్గా ఇక్కడే కారు పార్టీ గేర్ మార్చిందా?..ప్రజల్లో క్రేజ్ కొట్టేసేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్న విపక్ష గులాబీ పార్టీ..ఇంతకీ ఏ అస్త్రాలతో ప్రభుత్వానికి గుబులు రేపుతుంది?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని,ప్రభుత్వాన్ని సమస్యల వలయం అష్ట దిగ్బంధనం చేస్తుంది.చాలా కాలంగా వేదిస్తున్న యూరియా కొరత,..ఐకేపి,పి ఎ సి ఎస్ కేంద్రాల్లో తడిసి ముద్దవుతున్న ధాన్యం..బీసీ రిజర్వేషన్ ల అంశం,త్రిబుల్ ఆర్ భూ నిర్వాసితుల అల్టి మేటం,రైతన్నల గోస ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది.అన్నదాతలను సకాలంలో ఆదుకోవడం లేదంటూ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి విపక్షాలు.ఇటు రైతుల్లో కూడా అధికార పార్టీ పై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు బీసీ ఉద్యమం రేవంత్ సర్కార్ను మరింత డ్యామేజ్ చేస్తోంది.బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టమైన వైఖరితో లేరనేది బీసీ సంఘాల వాదన.

స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంలో రేవంత్ కుట్ర దాగి ఉందని విపక్షాలు కాకుండా బీసీ సంఘాలు ఆరోపణలు గుప్పించడం హాట్ టాపిక్ అయింది. 42% రిజర్వేషన్ల విషయంలో కోర్టు తీర్పు అటుంచితే అపవాదు మొత్తం రేవంతు మూటకట్టుకోవాల్సి వచ్చింది.మూడు రోజులుగా సోషల్ మీడియా వేదికగా బీసీ సంఘాలు తెగా విమర్శిస్తున్నారు. రేవంత్ తీరును తప్పుపడుతూ వస్తున్నాయి.ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు రాజ్యాంగ విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేస్తూ రెడ్డి సామాజిక వర్గ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో రేవంత్ కుట్ర ఉందని అంత ఆయన కనుసన్నలోనే జరిగిందనేది బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. దాంతో ఎటు తిరిగి ముఖ్యమంత్రి చిక్కుల్లో పడ్డట్టయింది.ఇదే సరైన సమయంగా భావించినట్లుంది బిఆర్ఎస్ పార్టీ. అందుకే ప్రభుత్వంపై ఎదురుదాడి చేసే ప్రయత్నాలు షురూ చేసింది.కారు గేరు మార్చి దూసుకెళ్తుంది.

స్థానిక సంస్థల రూపంలో రేవంత్ సర్కారు ను అష్ట కష్టాలు చుట్టు ముట్టాయి. ఇదే సమయంలో అదును కోసం చూస్తున్న ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంను టార్గెట్ చేస్తూ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టిందనే టాక్ వినపడుతుంది. మాజీ ముఖ్యమంత్రి, కేసీఆర్ సమీప అనుచరుడు, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, సొంత సెగ్మెంట్ నుంచే ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టింది.కాంగ్రెస్ ప్రభుత్వం 21 నెలల పాలనలో ఫెయిల్ అయిన అంశాలతో ఓ లిస్టు తయారు చేసింది.ఆరు గ్యారెంటీలు, 420 హామీలంటూ ప్రధానమైన అంశాలను హైలైట్ చేసింది. కాంగ్రెస్ బాకీ కార్డు అంటూ వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తోంది గులాబీ దళం. ఇక మరోవైపు వారం రోజులుగా సూర్యాపేటలో కాంగ్రెస్ బాకీ కార్డు హల్చల్ చేస్తోంది.కాంగ్రెస్ బాకీ కార్డులను గడప గడపకు తీసుకువెళ్తున్నారు కారు పార్టీ నేతలు.

వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ ఆరు గ్యారెంటీలను ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోని ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన ఆ పార్టీ నేతల మాటలను గుర్తు చేస్తున్నారు. కీలక హామీ, ఆసరా పెన్షన్లు, రైతు భరోసా పెంపు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ మహిళలకు 2500 రూపాయలు, యువతులకు స్కూటీలు, నిరుద్యోగులకు ఉద్యోగాల వంటి అంశాలను బాకీ కార్డులో రూపొందించారు.రేవంత్ సర్కార్ చెప్పిన 100 రోజుల గడువు మినహాయించి అప్పటిదాకా ఆయా వర్గాల లబ్ధిదారులకు ప్రభుత్వం ఎంత బాకీ పడిందో గులాబీ పార్టీ నేతలు పూస గుచ్చినట్టు వివరించడం చర్చకు తెరలేపింది. సూర్యాపేట నియోజకవర్గంలో పల్లె పల్లెకు పట్టణంలోని గల్లీ గల్లీకి తిరుగుతూ మరి కాంగ్రెస్ బాకీ కార్డును ప్రజలకు అందించడం గులాబీ శ్రేణులో ఫుల్ జోష్ తెస్తుండగా ఈ పరిణామం అధికార పార్టీ నేతలను డామేజ్ చేస్తోంది.మరో వైపు బీసీ లంతా ఏకమై సర్కారు కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.మరో వైపు సొంత పార్టీ నేతలు సైతం త్రిబుల్ ఆర్ రూపంలో రైతులను రెచ్చగొడుతున్నారనే చర్చ జరుగుతుంది.సమస్యల వలయంలో కొట్టు మిట్టడుతున్న కాంగ్రెస్ పరిస్థితి “విడవమంటే పాముకి కోపం – కరవమంటే కప్పకు కోపం”లా తయారైంది. BRS criticizes CM Revanth.

మొత్తానికి సందట్లో సడేమియా అన్నట్టుగా అదువును చూసి దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తోంది గులాబీ పార్టీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ అస్త్రాలన్ని బలంగా వాడాలని చూస్తోంది.మరి కారు పార్టీ ఎత్తులు ఏ మేరకు పని చేస్తాయి.ప్రత్యర్థుల ఎదురుదాడిని అధికార పార్టీ ఏ విధంగా ఎదుర్కొంటుంది అనేది ముందు ముందు చూడాల్సిందే.