సినిమా హిట్టా, ఫట్టా అనేది దళపతి విజయ్‌కి అనవసరం..ఆయన తమిళనాట స్క్రీన్ మీద కనిపిస్తే బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే! సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో మాస్ క్రేజ్ సంపాదించుకున్న ఏకైక తమిళ హీరో విజయ్. ‘గోట్’ సినిమాతో 400 కోట్లు కొల్లగొట్టిన ఈ బాక్సాఫీస్ రారాజు, ఇప్పుడు తన కోట్లాది మంది అభిమానులకు ఒకవైపు తీపి కబురు,మరోవైపు గుండె కోత మిగిల్చే వార్త చెప్పారు. అవును.. తన సినీ ప్రస్థానానికి స్వస్తి పలుకుతూ, విజయ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సౌత్ ఇండియాలోనే అతిపెద్ద హాట్ టాపిక్‌గా మారింది.మలేసియా రాజధాని కౌలాలంపూర్ శనివారం జరిగిన ‘జన నాయగన్’ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకలో విజయ్ మాట్లాడారు.ఈ సందర్భంగా తన మనసులోని మాటను బయటపెట్టారు.నా గుండెల్లో నివసించే స్నేహితులు, స్నేహితురాళ్లకు నమస్కారం’ అంటూ మొదలైన ఆయన ప్రసంగం ఆద్యంతం ఎమోషనల్‌గా సాగింది. సినిమాల్లోకి వచ్చినప్పుడు ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనుకున్నాను,కానీ మీరు నన్ను ప్యాలెస్‌లో కూర్చోబెట్టారు’ అంటూ అభిమానుల పట్ల తన కృతజ్ఞతను చాటుకున్నారు.
అభిమానుల కోసం రాబోయే కాలంలో తాను నిలబడతానని, వారి సేవలోనే తన జీవితాన్ని గడుపుతానని ఆయన స్పష్టం చేశారు.ఈ విషయాన్ని ఆయనే అధికారికంగా ప్రకటించారు.’తొలిరోజు నుంచి 33 ఏళ్లుగా మీరే నా వెంట ఉన్నారు. మీతో మరో 33 ఏళ్లు నిలబడాలని నిర్ణయించుకున్నా. నా కోసం అన్నింటినీ వదులుకున్న అభిమానుల కోసం సినిమాలను వదులుకుంటున్నా’ అని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో విజయ్ ఒంటరిగా వస్తారా? జట్టుగా వస్తారా? అని తరచూ అడుగుతున్నారు. 33 ఏళ్లుగా మీతో జట్టుగానే వచ్చాను. ఇకపై జట్టుగానే వస్తాను.ఈ క్లారిటీ సరిపోదనుకుంటా…సస్పెన్స్లోనే కిక్ ఉంటుంది’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడం అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు.ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనే తపన ఆయనలో ఎప్పటి నుంచో ఉంది.వరదలో కొట్టుకుపోతున్న వాడికి పడవలా, ఎడారిలో దాహంతో ఉన్నవారికి ఒంటె సహాయం చేసినట్టే..ఇప్పుడు నేను ప్రజలకు ఉపయోగపడాలనుకుంటున్నాను అని విజయ్ చెప్పిన మాటలు ఆయనలోని సేవా గుణానికి అద్దం పడుతున్నాయి.జనాల కోసం చేసే ఈ పోరాటంలో ‘జననాయగన్’ తన చివరి చిత్రమని ఆయన అధికారికంగా ప్రకటించేశారు. భారీ రెమ్యూనరేషన్, స్టార్ హోదా, కోట్లాది రూపాయల బిజినెస్..వీటన్నింటినీ వదులుకుని ప్రజల కోసం కెరీర్‌నే త్యాగం చేసే గట్స్ ఒక్క విజయ్‌కే ఉన్నాయని విజయ్ అభిమానులు అంటున్నారు.
దళపతి నిర్ణయంతో ఫ్యాన్స్ కన్నీరు పెట్టుకుంటున్నారు.తమ అభిమాన హీరోని మళ్లీ స్క్రీన్ మీద చూడలేమనే బాధ ఒకవైపు ఉన్నా,ఆయన రియల్ లైఫ్ హీరో అవ్వాలని కోరుకుంటున్నారు.దళపతి విజయ్ రీల్ లైఫ్‌లో అన్యాయాన్ని ఎదిరించిన ఎన్నో పాత్రల్లో నటించి న మెప్పించారు, ఇప్పుడు రియల్ లైఫ్‌లో జన నాయకుడిగా మారి వ్యవస్థను మార్చేందుకు సిద్ధమయ్యారు.తన ప్రాణం ఉన్నంతవరకు ప్రజల పక్షాన పోరాడతానని ఆయన ఇచ్చిన మాట అభిమానుల్లో కొత్త ఊపిరి పోస్తోంది.